ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్దిమంది నటుల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ.. చిన్న చిన్న పాత్రలతో నటుడిగా మారాడు. ఆ తర్వాత హీరోగా నిలుదొక్కుకున్నాడు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో స్టార్ హోదాను సంపాదించుకున్నాడు. ఇప్పటికీ వరుసగా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులు అలరిస్తున్న రవితేజ.. తన సుధీర్గ సినీ ప్రయాణంలో కొన్ని సూపర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకున్నారు.
అందులో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఢీ మూవీ కూడా ఒకటి. అయితే ఢీ సినిమాను రవితేజ మిస్ చేసుకున్నాడు అనడం కన్నా మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణు కోసం దొబ్బేశారు అనడమే కరెక్ట్ అట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకీ మూవీతో బిగ్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్లతో రవితేజ మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగానే ఢీ కథను శ్రీను వైట్ల రెడీ చేశారు. రవితేజకు ఢీ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పడం.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడం చకచకా జరిగిపోయాయి.
అయితే ఇంతలో సీన్ లోకి మోహన్ బాబు ఎంటర్ అయ్యారు. ఒకరోజు శ్రీను వైట్లతో మోహన్ బాబు మాట్లాడుతూ.. మంచు విష్ణుని హీరోగా పెట్టి ఓ సినిమా చేయమని అడిగారట. ప్రస్తుతం రవితేజతో సినిమా తీస్తున్నానని.. అది అయ్యాక చేస్తానని చెప్పారట. ఆ సినిమా స్టోరీ చెప్పాలని మోహన్ బాబు కోరడంతో.. శ్రీను వైట్ల నెరేట్ చేశారు. స్టోరీ మోహన్ బాబుకు బాగా నచ్చేసింది. మంచు విష్ణుతో ఇదే కథతో సినిమా తీయాలని ఆయన పట్టుబట్టారు.
కానీ అందుకు శ్రీను వైట్ల అంగీకరించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రవితేజకు స్టోరీ చెప్పడం.. ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి. ఇక శ్రీనువైట్ల మొహమాటాన్ని గమనించిన మోహన్ బాబు నేరుగా రవితేజకు ఫోన్ చేశారట. ఢీ స్టోరీ మంచు విష్ణుకి ఇచ్చేయమని అడిగారట. దాంతో రవితేజ తప్పని పరిస్థితుల్లో ఢీ ను వదిలేసుకున్నారు. ఇక మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన ఢీ చిత్రం 2007లో సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత ఢీ రేంజ్ లో మంచు విష్ణుకు మరో హిట్ పడకపోవడం గమనార్హం