ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం భారతీయుడు 2. దాదాపు 28 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన భారతీయుడు చిత్రానికి సీక్వల్ ఇది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ భారతీయుడు 2 చిత్రాన్ని నిర్మించారు.
సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, ఎస్.జె.సూర్య, ప్రియ భవాని శంకర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. అనేక అడ్డంకులను దాటుకుని ఎన్నో అంచనాల నడుమ జులై 12న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలైన భారతీయుడు 2 మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. కథ కథనం, సాగతీత సన్నివేశాలు, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం, అనవసరంగా కనిపించే పాత్రలు, గ్రిప్పింగ్ లేని స్క్రీన్ ప్లే, అసంతృప్తి పరిచే సాంగ్స్ సినిమాలకు పెద్ద మైనస్ లుగా నిలిచాయి.
పైగా భారతీయుడు చిత్రాన్ని భారతీయుడు 2 మూవీ ఏ మాత్రం మరిపించలేకపోయింది. అయితే టాక్ అనుకూలంగా రాకపోయినా భారీ బజ్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ విషయంలోనూ నిరాశే ఎదరైంది. తెలుగులో రూ. 24 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దూకిన భారతీయుడు 2 మూవీ మొదటి రోజు రూ. 6.75 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకుంది.
అలాగే తమిళంలో శుక్రవారం రోజు ఈ సినిమా రూ. 17 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ కు మరీ దారుణంగా రూ. 1.10 కోట్లు వచ్చాయి. ఈ స్థాయి వసూళ్లతో బ్రేక్ ఈవెన్ అవ్వడమంటే అంత సులభం కాదనే చెప్పొచ్చు. కాగా, కమల్ హాసన్ బ్లాక్‌బస్టర్ మూవీ విక్రమ్ మొదటిరోజు రూ. 60 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కమల్ హసన్ విలన్‌గా నటించిన కల్కి 2898 ఏడీ రీసెంట్ గా విడుదలై ఫస్ట్ డే ఏకంగా రూ. 190 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాల దరిదాపుల్లో కూడా భారతీయుడు 2 లేకపోవడంతో కమల్ అభిమానులు ఎంతగానో ఫీల్ అవుతున్నారు.