పలు సినిమాల్లో అనేక మంది సీనియర్ ఆర్టిస్టులు అతిథి పాత్రలు వేసిన విషయం తెలిసిందే. రావుగోపా ల రావు నుంచి అల్లు రామలింగయ్య వరకు చాలా మంది అతిథి పాత్రలు వేసిన సినిమాలు ఉన్నాయి. వాటిలోనూ వారికి పేరు వచ్చింది. ఉదాహరణకు ముత్యాల ముగ్గు సినిమాలో మాడా వెంకటేశ్వరరావు కేవలం 1-2 నిమిషాలు కనిపించే పాత్ర వేశారు. దానికి ఆయనకు రూ.5 వేలు పారితోషికం ఇచ్చారు. అయితే.. ఆయన పేరు మాత్రం ఇప్పటికీ నిలిచిపోయింది.
ఇలానే అనేక మంది నటించారు. మంచి పేరు కూడా వచ్చింది. అయితే.. ఇలాంటి అతిథి పాత్రలకు అక్కినేని నాగేశ్వరరావు ససేమిరా అనేవారు. ఎవరైనా తనను సంప్రదించి.. అతిథి పాత్రలు వేయాలని కోరితే.. ఆయన ఒప్పుకొనేవారు కాదు. ఒక సినిమాలో జడ్జి పాత్రకు డైరెక్టర్ రాఘవేంద్రరావు స్వయంగా అక్కినేనిని అతిథి పాత్ర వేయాలని కోరారు. మీ రెమ్యునరేషన్ మీరు తీసుకోండి.. అని కూడా ఆఫర్ ఇచ్చారు. కానీ, అక్కినేని ఒప్పుకోలేదు.
అదేవిధంగా జగపతి బాబు తండ్రి, దర్శక నిర్మాత రాజేంద్రప్రసాద్ కూడా రెండు సినిమాల్లో అక్కినేనిని అతిథి పాత్రలు వేయాలని కోరారు. కానీ, దీనికి కూడా అక్కినేని ఒప్పుకోలేదు. దీంతో ఆయా పాత్రలకు వేరేవారిని తీసుకున్నారు. ఇలా వదులుకోవడం వెనుక.. డబ్బే కారణమనేది కొందరు వాదించేవారు. అక్కినేనికిపూర్తి రెమ్యునరేషన్ రాదని.. అందుకే ఆయన వదులుకున్నారని అప్పట్లో దర్శకుల మధ్య చర్చ నడిచింది. కానీ, ఆయా పాత్రలకు సినిమాల్లో మంచి పేరు రావడం గమనార్హం.