భారతీయుడు.. 1996లో విడుదలైన విజిలెంట్ యాక్షన్ చిత్రం. ఎస్. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా చేశారు. మనీషా కొయిరాలా, ఊర్మిళ మటోండ్కర్, సుకన్య, కస్తూరి, మనోరమ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్ రత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
1996న మే 9న విడుదలైన భారతీయుడు(తమిళంలో ఇండియన్) చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభించింది. అప్పట్లో రూ. 15 కోట్లతో సినిమాను నిర్మించగా.. విడుదల తర్వాత ఏకంగా రూ. 35 కోట్ల రేంజ్లో వసూళ్లు వచ్చాయి. దేశంలోని అవినీతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ఒక రిటైర్డ్ స్వాతంత్ర్య సమరయోధుడు వీరశేఖరన్ సేనాపతి కథే భారతీయుడు.
ఇందులో కమల్ హాసన్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ముఖ్యంగా సేనాపతి పాత్రలో కమల్ నటన, హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో రంజింపజేశాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. భారతీయుడు మూవీకి ఫస్ట్ ఛాయిస్ కమల్ హాసన్ కాదు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. అయితే రజనీకాంత్ భారతీయుడు కథకు నో చెప్పారు. దాంతో ఏ హీరోతో వెళ్లాలనే సంశయం శంకర్ లో మొదలైంది. అప్పుడే ఆయనకు ఓ ఆలోచన వచ్చింది.
సేనాపతి పాత్రకు రాజశేఖర్ మరియు ఆయన కొడుకు పాత్రను వెంకటేష్ లేదా నాగార్జునతో చేయిస్తే బాగుంటుందని శంకర్ భావించారు. కానీ ఆయన ప్రణాళికలు కార్యరూపం దాల్చలేదు. ఫైనల్ గా కమల్ హాసన్ ను సంప్రదించగా.. ఆయనకు స్టోరీ చాలా బాగా నచ్చింది. దాంతో ఆయన చేతే శంకర్ ద్విపాత్రాభినయం చేయించారు. ఒకవేళ కమల్ హాసన్ కూడా నో చెప్పుంటే భారతీయుడు కచ్చితంగా రాజశేఖర్ సినిమా అయ్యేదని గతంలో అసెస్టెంట్ డైరక్టర్ వసంత్ బాలన్ తెలిపారు. కాగా, భారతీయుడు విడుదలైన 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా భారతీయుడు 2 రాబోతోంది. జూలై 12న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.