సెలబ్రిటీల ఇళ్లల్లో పెళ్లిళ్లు అంటే ఖర్చు కోట్లలో ఉంటుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా ఈ మధ్యకాలంలో సినీ తారలంతా విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇటీవల థాయిలాండ్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో తన ప్రియసఖుడు, ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ ను వరలక్ష్మి పెళ్లి చేసుకుంది.
జులై 2న చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత చెన్నైలో తాజ్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ వేడుకకు ఎందరో సినీ మరియు రాజకీయ ప్రముఖులు అతిథులుగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. టాలీవుడ్ నుంచి బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు హాజరై వరలక్ష్మి-నికోలాయ్ దంపతులకు విషెస్ తెలిపారు. ఇకపోతే గత రెండు రోజుల నుంచి వీరి పెళ్లి బడ్జెట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
శరత్ కుమార్ తన ముద్దుల కూతురు వరలక్ష్మి పెళ్లి కోసం రూ. 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని బలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా నికోలాయ్ తన ప్రియమైన భార్య వరలక్ష్మికి పెళ్లి సందర్భంగా గోల్డ్ తో తయారు చేయించిన చెప్పులు, డైమండ్స్ పొదిగిన చీరను కానుకులుగా ఇచ్చాడనే వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలను తాజాగా శరత్ కుమార్ ఖండించారు.
ఎటువంటి సమాచారం లేకుండా తప్పుడు కథనాలు సృష్టించవద్దని హెచ్చరించారు. అలాగే తాను రూ. 200 కోట్లతో వరలక్ష్మి పెళ్లి చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని శరత్ కుమార్ వెల్లడించారు. వరలక్ష్మి వివాహం మాకున్న స్థాయిలోనే, అందరిలాగే చేశామని.. ఖర్చు విషయంలో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తమని తెలిపారు. అసలు అంత డబ్బే ఉంటే తానెందుకు సినిమాల్లో నటిస్తాను అన్నట్లుగా కూడా శరత్ కుమార్ కామెంట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు గాలి వార్తలే అని తేలిపోయింది.