Moviesయాత్ర 2 రివ్యూ: వైసీపీ, జ‌గ‌న్ వీరాభిమానుల సినిమా

యాత్ర 2 రివ్యూ: వైసీపీ, జ‌గ‌న్ వీరాభిమానుల సినిమా

వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా గత ఎన్నికలకు ముందు తెరకెక్కిన యాత్ర సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో యాత్ర సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2 సినిమా తెరకెక్కింది. తమిళ హీరో జీవా.. మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలలో దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర 2 సినిమా వైఎస్సార్‌సీపీ అభిమానుల్లో రిలీజ్ కి ముందే మంచి హైప్‌ తెచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
వైయస్ రాజశేఖర్ రెడ్డి ( ముమ్ముట్టి ) తన కొడుకు జగన్ ( జీవా) ని 2009 సాధారణ ఎన్నికలలో కడప ఎంపీగా నిలబెడుతున్నాను అని ప్రజలకు పరిచయం చేయడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వైఎస్సార్ ఎన్నికలలో రెండోసారి విజయం సాధించి రెండోసారి ముఖ్యమంత్రి అవ్వటం చూపిస్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ చేపట్టిన పరామర్శ యాత్రను ఆపమని పైనుంచి ఆదేశాలు వస్తాయి. దీంతో జగన్ కొత్తగా పార్టీ పెట్టి ఉప ఎన్నికల్లో గెలుస్తాడు. ఆ తర్వాత కొన్ని నాటకీయు పరిణామాల మధ్య జగన్ పై సిబిఐ దాడులు జరుగుతాయి.. జగన్ అరెస్టు అవుతాడు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో చంద్రబాబు ( మహేష్ మంజ్రేక‌ర్‌) ముఖ్యమంత్రి అవ్వటం.. మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ప్రతిపక్ష నేతగా ఉండటం ఎన్నో ఇబ్బందులకు గురికావడం.. చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు ? 2019లో ఎలా సీఎం అయ్యాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేష‌ణ :
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మినీ బయోపిక్‌గా తెరకెక్కిన యాత్ర 2 లో వైయస్సార్ మరణం త‌ర్వాత ప్రజల ఎమోషన్, తన తండ్రి బాటలో నడవాలని కొడుకు లక్ష్యం ఏమైంది ? ఆ లక్ష్యం సాధించేందుకు కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు.. చివరికి సొంతంగా పార్టీ పెట్టి సమర్థవంతంగా ఆ పార్టీని నడిపించి అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు ? లాంటి అంశాలు సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. మహీ వి రాఘవ దర్శకత్వం బాగుంది. జీవా జగన్మోహన్ రెడ్డిగా చాలా బాగా నటించాడు. లెజెండరీ నటుడు ముమ్ముట్టి కూడా యాత్ర 2లో వైఎస్సార్‌గా అద్భుతంగా నటించారు. సినిమాలో సోనియా పాత్రలో నటించిన జర్మనీ నటి సుజానే బెర్నార్డ్‌ కూడా చాలా బాగా నటించింది.

చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ అలా ఒదిగిపోయారు. మిగిలిన ప్రధాన నటీనటులు అందరూ తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు. ఒరిజినల్ పాత్రలను బాగా ఇమిటేట్ చేస్తూ మెప్పించారు. ఎమోషన్.. పాత్రల ఎలివేషన్లు కొన్నిచోట్ల ఆసక్తిగా ముందుకు సాగాయి. దర్శకుడు తీసుకున్న వాస్తవిక కథనం బాగున్న కథనం మాత్రం కొన్నిచోట్ల సింపుల్గా స్లోగా సాగుతుంది. ఫస్టాఫ్ లో కొన్ని సీక్వెన్సెస్ అలాగే సెకండ్ హాఫ్ లో ప్రారంభంలో సినిమా అంతా ఆసక్తిగా ఉండదు. జగన్ ప్రత్యర్థి పార్టీ నాయకులు మధ్య వచ్చే కొన్ని రాజకీయ సన్నివేశాలు కూడా చాలా రెగ్యులర్గా ఉంటాయి. మొత్తంగా ద‌ర్శ‌కుడు రాసుకున్న కంటెంట్ స్క్రీన్ మీద బాగా ఎలివేట్ అయింది.. కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్లు కట్ చేసి ఉంటే సినిమాకి ఇంకా ప్లస్ అయ్యేది.

అలాగే స్క్రీన్ ప్లే అందరి అంచనాలకు తగ్గట్టుగానే సాగుతుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది. ఇంటర్వెల్‌లో ఎమోషన్స్ పెంచి సెకండాఫ్ పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా అది అంత ఎఫెక్టివ్ గా వర్క్ అవుట్ కాలేదు. ఇక క్లైమాక్స్ కూడా అందరు ఊహించిన విధంగానే ఉంటుంది. టెక్నికల్ గా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే దర్శకుడు రాఘవ మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. కథపై పూర్తి గ్రిప్ క‌న‌ప‌రిచాడు. టేకింగ్ కూడా చాలా బాగుంది. అయితే ఆసక్తిగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో తడబడ్డాడు. సంగీత దర్శకుడు పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కీలక సన్నివేశాలలో బాగా కుదిరింది. ఎడిటర్ కొన్ని రొటీన్ పొలిటికల్ సీన్లను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత శివ మేక నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ యాత్ర 2 జగన్ అభిమానులకు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు.. వైఎస్ఆర్సిపి అభిమానులకు ఓ ఎమోషనల్ ఫీస్ట్‌గా నిలుస్తుంది. ముమ్ముట్టి, జీవా తమ నటనతో సినిమాని మరో లెవెల్ కు తీసుకువెళ్లారు. ఓవ‌రాల్‌గా యాత్ర 2 వైసీపీ అభిమానులకు సూపర్ హిట్.

ఫైన‌ల్ పంచ్‌: వైఎస్సార్ సీపీ ఫ్యాన్స్‌కు, జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు యాత్ర 2 బ్లాక్‌బ‌స్ట‌ర్‌

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news