Movies" రాజుగాడు " రివ్యూ & రేటింగ్

” రాజుగాడు ” రివ్యూ & రేటింగ్

కుమారి 21ఎఫ్ తో యువ హీరోగా జోష్ కనబరచిన రాజ్ తరుణ్ ఆ తర్వాత కొద్దిగా వెనుక పడ్డాడు. తన సినిమాలు వస్తున్నాయ్ వెళ్తున్నాయ్ కాని సరైన ప్రేక్షకాదరణ నోచుకోవట్లేదు. ఈ క్రమంలో ఏ.కే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సంజనా రెడ్డి డైరక్షన్ లో వచ్చిన సినిమా రాజుగాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

చిన్ననాటి నుండి విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంటాడు రాజు (రాజ్ తరుణ్) అదేంటి అంటే తనకు తెలియకుండానే దొంగతనాలు చేస్తుండటం. పెద్దయ్యాక కూడా అది ముదురుతుందే తప్ప తగ్గదు. ఈ రోగం ఉంది అని తనకు తెలిసినా ఏం చేయలేని పరిస్థితి. ఇక ఇది కవర్ చేసుకుంటూ తనకు నచ్చిన అమ్మాయి తన్వి (అమైరా దస్తర్)ను ప్రేమిస్తాడు రాజు. తన్వి కూడా రాజుని ఇష్టపడుతుంది. పెద్దలు వీరి పెళ్లికి ఓకే చెబుతారు. అంతా సాఫీసా సాగుతున్న ఈ తరుణంలో తన్వి వాళ్ల తాత నాగినీడు దగ్గరకు ఓ 10 రోజులు ఉండాలని వెళ్తారు రాజు, తన్వి. తనకున్న ఈ రోగం గురించి రాజ్ తన్వికి తెలియనివ్వడు. తన్వి తాత, ఊళ్లో పెద్దమనిషి చిన్న దొంగతనం చేసిన వాడిని కూడా వదిలిపెట్టడు. అలాంటి ఇంట్లో రాజు ఎలా తన ప్రేమను దక్కించుకున్నాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

రాజ్ తరుణ్ ఎప్పటిలానే తన జోష్ ఫుల్ నటనతో ఈ సినిమాలో కనిపించాడు. పాత్రకు తగినట్టుగా తన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక అమైరా దస్తర్ కు అంత ప్రాధాన్యత కలిగిన పాత్ర ఏమి కాదు. ఉన్నంతవరకు ఓకే. తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ఆకట్టుకున్నారు. సితార, నాగినీడు, ప్రవీణ్ వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గోపిసుందర్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కు తగిన పిక్చరైజేషన్ లేదని చెప్పొచ్చు. దర్శకురాలు సంజనా రెడ్డి కథ అంత పకడ్బందీగా రాసుకోలేదు. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా వచ్చినా అందులోనూ ఆకట్టుకోలేదు. అనీల్ సుంకర ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేయాల్సింది. డైలాగ్స్ రొటీన్ గానే ఉన్నాయి.

విశ్లేషణ :

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు లాంటి కథే రాజుగాడు. ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కు ఆ సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే ఆ సినిమాల్లో కథనం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది అందుకే మంచి హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో హీరోకి దొంగతనం అలవాటు ఉంది అని చూపించినా అది ఎక్కడ ఫన్ క్రియేట్ చేయలేదు.

ఇక మొదటి భాగం పాత్రల పరిచయాలు మెయిన్ స్టోరీలోకి వెళ్లడం అంతా బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదు. మళ్లీ క్లైమాక్స్ లో కొంత బెటర్ అనిపిస్తుంది. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా వర్క్ అవుట్ కాలేదు. సినిమాలో రాజ్ తరుణ్ కూడా ఎందుకో పాత్రలో ఇమడలేకపోయాడన్న భావన వస్తుంది.

ఏదో ఒక సినిమా సరదాగా చూద్దాం అనుకున్న వారికి నచ్చొచ్చు కాని కొత్తతరహా కథలు కావాలనుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉండదు.

ప్లస్ పాయింట్స్ :

కొన్ని కామెడీ సీన్స్

ఎంచుకున్న కాన్సెప్ట్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

స్టోరీ

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

రాజుగాడు.. రాజ్ తరుణ్ మళ్లీ నిరాశ పరచాడు..!

రేటింగ్ : 2/5.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news