ఈ టైటిల్ వినడానికి కాస్త చిత్రంగానే ఉండొచ్చు. మామూలుగానే మెగా ఫ్యామిలీ అంటే హిట్ డైరెక్టర్ల వెంటే పడుతుంటుంది. అందులోనూ బన్నీ అయితే ఎంత గొప్ప డైరెక్టర్ అయినా ఒక ప్లాప్ ఇచ్చాడంటే చాలు.. అతడితో సినిమా చేయడానికి ఎంతో వెనకా ముందు ఆడతూ ఉంటాడు. ఒక్క ప్లాప్ పడితే పెద్ద డైరెక్టర్లను సైతం బన్నీ దగ్గరకు రానివ్వడానికి పెద్దగా ఇష్టపడడంటారు. బోయపాటి, సుకుమార్, త్రివిక్రమ్ ఇలా ఎక్కువుగా హిట్లు ఇచ్చిన డైరెక్టర్లతోనే వెంటనే సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తాడు.
ఇక రామ్‌చరణ్ కూడా అంతే. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తితోనే ఉన్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమా ఉంటుందని… గుంటూరు కారం తర్వాత నాతో సినిమా కోసం పాన్ ఇండియా కథ రెడీ చేసుకోవాలని బన్నీ త్రివిక్రమ్‌కు చెప్పినట్టు మొన్న సంక్రాంతి ముందు వరకు ఒక్కటే ప్రచారం నడిచింది. గుంటూరు కారం రిజల్ట్ దెబ్బతో బన్నీ ఆలోచనలు మారిపోయినట్టుగా తెలుస్తోంది.
ఓ రీజనల్ కథతో చాలా నాసిరకం సినిమా తీసిన త్రివిక్రమ్‌తో పాన్ ఇండియా కథతో సినిమా చేయడం అంటే చాలా పెద్ద రిస్క్ అన్న నిర్ణయానికి బన్నీ వచ్చేశాడట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్‌చరణ్ కూడా త్రివిక్రమ్‌కు ఛాన్స్ ఇవ్వడు. పవన్ ఎలాగూ రాజకీయాల్లో బిజీ.. పవన్ ఒప్పుకున్న సినిమాలే చాలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్‌కు మళ్లీ ఎన్టీఆరే గతి అయినట్టు తెలుస్తోంది. అజ్ఞాతవాసి ప్లాప్ తర్వాత త్రివిక్రమ్‌ను టాలీవుడ్‌లో ఓ మిడిల్ రేంజ్ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు.
ఆ టైంలో ఎన్టీఆర్ పిలిచి అరవింద సమేత ఛాన్స్ ఇస్తేనే త్రివిక్రమ్ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ బన్నీ పిలిచి అల వైకుంఠపురం ఛాన్స్ ఇచ్చాడు. అదే బన్నీ ముందనుకున్న కమిట్‌మెంట్ ప్రకారం ఇప్పుడు త్రివిక్రమ్‌కు ఛాన్స్ ఇచ్చేది సందేహమే అంటున్నారు. దీంతో ఎన్టీఆర్ నుంచి త్రివిక్రమ్‌కు పిలుపు వెళ్లినట్టు తెలుస్తోంది. అసలు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేయాలి.. క్రియేటివ్ డిఫరెన్సెస్ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌ను ఎవ్వరూ నమ్మకపోతే ఎన్టీఆర్ పిలిచి ఎలా ? ఛాన్స్ ఇచ్చాడో ఇప్పుడు కూడా మరోసారి ఎన్టీఆర్ పిలిచి అవకాశం ఇస్తోన్న పరిస్థితి. అయితే ఎన్టీఆర్ దేవర, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేశాకే త్రివిక్రమ్‌తో జతకట్టే ఛాన్స్ ఉంది.