టైటిల్: డంకీ
నటీనటులు: షారుఖ్ ఖాన్, బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ తదితరులు
కథ, మాటలు: అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరాణీ, కణికా థిల్లాన్
సినిమాటోగ్రఫీ : సీకే మురళీధరన్, మనుష్ నందన్, అమిత్ రాయ్, కుమార్ పంకజ్
నేపథ్య సంగీతం: అమన్ పంత్
పాటలు: ప్రీతమ్
నిర్మాతలు: గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే
దర్శకత్వం: రాజ్ కుమార్ హిరాణీ
రిలీజ్ డేట్ : డిసెంబర్ 21, 2023
రేటింగ్: 2.5/5
‘పఠాన్’, ‘జవాన్’… సినిమాలతో గత కొన్నేళ్లుగా హిట్లు లేని బాద్ షా, కింగ్ షారుక్ ఖాన్ 2023లో రెండు సూపర్ హిట్లు అందుకున్నారు. ఈ రెండు సినిమాలు కూడా రు. వెయ్యేసి కోట్లు కొల్లగొట్టాయి. ఈ క్రమంలోనే ఈ యేడాది డంకీ సినిమాతో మూడోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘మున్నాభాయ్’ సిరీస్, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ ఫేమ్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాను తెలుగులో డబ్ చేయకపోయినా దర్శకుడికి తెలుగులోనూ చెప్పుకోదగిన అభిమానులు ఉన్నారు. రేపు ప్రభాస్ సలార్ రిలీజ్ వేళ భారీ అంచనాలతో ఆ సినిమాను ఢీ కొట్టేలా థియేటర్లలోకి దిగిన డంకీ ఈ యేడాది షారుక్‌కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం.
కథ:
హర్డీ సింగ్ థిల్లాన్ ( షారుఖ్ ఖాన్ ) సైనికుడు. అతడిది పఠాన్ కోట్ ప్రాంతం. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి కోసం వెతుక్కుంటూ లల్టూ వస్తాడు. ఈ క్రమంలోనే అక్కడ మను ( తాప్సి ) పరిచయం అవుతుంది. వీళ్ళందరూ కలిసి ఊరిలో కష్టాల నుంచి బయటపడేందుకు మంచి లైఫ్ కోసం ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులు లండన్ వెళ్లాలని ప్రయత్నిస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకునేందుకు అష్ట కష్టాలు పడతారు. కానీ వీసాలు రావు. అప్పుడు దొంగ దారిలో లండన్ వెళతారు. హర్టీ, మనుతో పాటు మిగిలిన వాళ్ళు ఎలా లండన్ వెళ్లారు ? ఈ ప్రయాణంలో ఎలాంటి కష్టాలు పడ్డారు ? లండన్ వెళ్లాక వారి జీవితాల్లో వచ్చిన మార్పు ఏంటి ? వీళ్ళ జీవితాల్లో సుఖీసింగ్ ( వీక్కీకౌశల్ ) పాత్ర ఏమిటి అన్నది తెరమీద చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ కు తెలుగులోనూ కొందరు అభిమానులు ఉన్నారు. ఎలాంటి కథ.. సన్నివేశంలో అయినా కామెడీ జోడించి చెప్పటంలో ఆయన స్పెషలిస్ట్. త్రి ఇడియట్స్ – పీకే – సంజు సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన నగరాల్లో మంచి వసూళ్లు సాధించడానికి కారణం రాజ్‌కుమార్ టేకింగ్, దర్శకత్వం అని చెప్పక తప్పదు. డంకిని నేరుగా తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించటానికి ప్రధాన కారణం దర్శకుడు రాజకుమార్. ఆయనపై అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
ఈ కథను ఒక జానర్‌కు పరిమితం చేయలేం. అడ్డదారుల్లో వలస వెళ్లడానికి కొందరు ఎలాంటి కష్టాలు పడుతున్నారు అనేది మనసును హత్తుకునేలా చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకు కాలం అడ్డు కాదని చెప్పారు. అలాగే సినిమాలో ఇన్ డైరెక్ట్ గా దేశభక్తి, మాతృదేశంపై ప్రేమ కూడా ఉన్నాయి. అయితే సినిమాలో రాజ్ కుమార్ డైరెక్షన్ స్టైల్, ఆయన హ్యూమర్ మిస్ అయిన ఫీలింగ్ కచ్చితంగా ఉంటుంది. సినిమా చూస్తున్నా ఏదో వెరైటీ, ఎమోషనల్ డ్రామాలో లోతు కనిపించదు. కావాలని కొన్నిచోట్ల ఎమోషన్లు ఇరికించినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూసేందుకు దర్శకుడిపై భారీ అంచనాలతో థియేటర్లలోకి వెళ్లిన ప్రేక్షకులు ఆ అంచనాలు అందుకోలేక డీలా పడతారు.
వీసా ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్ రాక పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అంతకుముందు బొమన్ ఇరానీ చెప్పిన ఇంగ్లీష్ క్లాసులు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కామెడీలో మాత్రం దర్శకుడు తన పట్టు చూపించినా ఎమోషనల్ డ్రామా మాత్రం పండలేదు. సినిమాలో ఈ సీన్ తర్వాత నెక్ట్స్ ఏంటి ? అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో ఆసక్తి కలిగించేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శైలి కనిపించలేదు. డంకి రూటులో బోర్డర్ దాటడం అనే పాయింట్ కూడా కొత్త కాదు. హిందీలో సల్మాన్ ఖాన్ భజరంగి భాయిజాన్ చేశారు.
అయితే ఆ కథ వేరు.. ఈ కథ వేరు. డంకీ రూటులో విదేశాలు వెళ్లిన వాళ్లను 25 ఏళ్ల తర్వాత డంకి రూటులో మళ్లీ స్వదేశానికి తీసుకురావటం దర్శకుడు స్టైల్ అని చెప్పుకోవచ్చు. అదికాక ఎండింగ్లో మరో ట్విస్ట్ ఉన్నా… క్లైమాక్స్ బాగా సాగదీశారు. పాటలు పరవాలేదు. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ఈ సినిమాను షారుక్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చెల్లి భాగస్వామిగా నిర్మించినా వీఎఫ్ఎక్స్ సరిగా లేదు. నిర్మాణ విలువల్లో కొన్నిచోట్ల రాజీ పడినట్టు అనిపించింది.
నటీనటుల పెర్పామెన్స్ :
పఠాన్ – జవాన్ లాంటి యాక్షన్ సినిమాల తర్వాత ‘డంకీ’ లాంటి ఎమోషనల్ డ్రామాతో షారుఖ్ ప్రేక్షకుల ముందుకు రావడం చాలా పెద్ద సాహసం అని చెప్పాలి. ఈ సినిమాలో షారుక్ పోషించిన హార్డీ సింగ్ క్యారెక్టర్ కోసం లార్జర్ దేన్ లైఫ్ ఇమేజ్ పక్కన పెట్టారు. ఇందులో షారుక్ కంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ మరోసారి ఎంటర్టైన్ చేస్తుంది. ఎమోషనల్ సీన్లలో షారుక్ అదరగొట్టాడు. ఇక తాప్సీ స్వతహాగా పంజాబీ అమ్మాయి కావడంతో ఆ పాత్రలో స్టైల్‌గా బాగా సెట్ అయ్యింది. తాప్సీలో పంజాబీ పల్లెటూరి అమ్మాయి కంటే మోడ్రన్ మహిళ ఎక్కువ కనిపించారు. విక్కీ కౌశల్ ఎమోషనల్ రోల్ చేశారు. సినిమా చూసి బయటకు వచ్చాక కూడా విక్కీ పాత్ర గుర్తుంటుంది. బొమన్ ఇరానీతో పాటు మిగిలిన నటీనటుల పాత్రలు గుర్తుండిపోతాయి.
ఫైనల్‌గా…
క్యారెక్టర్, సినిమా కోసం షారుఖ్ తన ఇమేజ్ పక్కన పెట్టి చేయడం హ్యాట్సాఫ్. ఇక దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ నుంచి ఆశించే కామెడీ చాలా తక్కువుగా మాత్రమే వర్కవుట్ అయ్యింది. ఇక సినిమా మొత్తం మీద మధ్యలో కొన్ని మెరుపులు మినహా ఫుల్ ప్లెజ్డ్ ఎమోషనల్ డ్రామా, ఎంటర్టైన్మెంట్ లేవు.
ఫైనల్ పంచ్ : హ్యాట్రిక్ మిస్ అయ్యింది షారుఖ్… సారీ..!
డంకీ రేటింగ్ : 2.5 / 5