సాధారణంగా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చాలా షరతులు పెడుతూ ఉంటాయి. సినిమా రిలీజ్ అయ్యాక.. ఫైనల్ బాక్సాఫీస్ రన్ పూర్తయ్యాక కానీ మల్టీప్లెక్స్ వసూళ్ల నుంచి వచ్చిన మొత్తం.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు చేరదు. అలాగే సినిమా రిలీజ్ అయ్యాక నాలుగు వారాల్లో ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నందుకు గాను విజయ్ లియో సినిమాను నార్త్ ఇండియాలో మల్టీప్లెక్స్ లు రిలీజ్ చేయలేదు. దీంతో లియో సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విషయంలో సలార్ టీం నార్త్ ఇండియాలో పివిఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లకు పెద్ద షాక్ ఇచ్చింది.
నార్త్ ఇండియాలో సలార్ సినిమాకు అన్యాయం చేయాలని.. ఈ రెండు సంస్థలకు చెందిన మల్టీప్లెక్స్‌లు చూడటమే ఇందుకు ప్రధాన కారణం. అసలు విషయంలోకి వెళితే ఈ శుక్రవారం సలార్ థియేటర్లలో భారీ ఎత్తున విడుదలవుతుంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా కనివినీ ఎరుగని రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కంటే ఒక రోజు ముందు బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన ఢంకీ సినిమా విడుదలవుతోంది. షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టి ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రు.1000 కోట్ల కలెక్షన్లు రాబట్టాయి.
దీంతో నార్త్‌లో పైన చెప్పుకున్న రెండు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు షారుక్ ఖాన్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇస్తూ ప్రభాస్ సినిమాకు చాలా తక్కువ స్క్రీన్లు ఇస్తున్నాయి. దీంతో ప్రభాస్.. సలార్ సినిమా నిర్మాతలు ఈ రెండు మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు బిగ్ షాక్ ఇచ్చేలా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నార్త్ రాజకీయాలకు సౌత్ లో అదిరిపోయేలా చెక్ పెట్టారు. ఏపీ, తెలంగాణలో సలార్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. బుక్ మై షో, పేటీఎం వంటి టికెట్ బుకింగ్ యాప్స్ ఓపెన్ చేస్తే.. పివిఆర్, ఐనాక్స్ మల్టీప్లెక్స్ లలో ఓపెన్ కాలేదు.
దీనికి కారణం ఏంటంటే నార్త్‌లో సలార్ సినిమాకు తక్కువ స్క్రీన్లు ఇచ్చి అన్యాయం చేసినందుకు నిరసనగా సౌత్‌లో వాళ్ళ థియేటర్లకు సినిమా ఇవ్వటం మానేశారు. నార్త్‌లో ప్రభాస్ కంటే.. షారుక్ ఖాన్, దర్శకుడు రాజకుమార్ హిరాణి అభిమానులు ఎక్కువ అని ఈ మల్టీప్లెక్స్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే ప్రభాస్ నటించిన సాహో సినిమా టాలీవుడ్లో ప్లాప్ అయినా కూడా హిందీలో ఏకంగా రూ.150 కు పైగా కోట్లు కొల్లగొట్టింది. ఇవన్నీ వదిలేసి ప్రభాస్ సినిమాపై విపక్ష చూపటం సలార్ సినిమా నిర్మాతలకు నచ్చలేదు.
పైగా సలార్‌లో మలయాళ స్టార్ పృథ్విరాజ్ ఉన్నారు. కేరళలో బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని టేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పైగా కేజీఎఫ్‌తో ఇండియాలో స్టార్ డైరెక్టర్‌గా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నారు. కన్నడంలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో సలార్‌కు పోటీ లేదు. ఆ సినిమా ఏ థియేటర్లలో ఉంటే ఆ థియేటర్లకే ప్రేక్షకులు వెళతారు. ఈ లెక్కన చూస్తే పివిఆర్, ఐనాక్స్, మిరాజ్ మల్టీప్లెక్స్ లకు భారీగా లాస్ తప్పదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఇప్పటికే అయినా ఈ మల్టీప్లెక్స్ లో యాజమాన్యాలు దిగివచ్చి నార్త్‌లో సలార్ సినిమాపై చేస్తున్న రాజకీయం ఆపుతాయేమో చూడాలి.