Moviesబాలయ్య, రమేష్ బాబు కోసం పంతానికి పోయిన ఎన్టీఆర్ , కృష్ణ.....

బాలయ్య, రమేష్ బాబు కోసం పంతానికి పోయిన ఎన్టీఆర్ , కృష్ణ.. ఆ వార్ మీకు తెలుసా..?

సినిమా రంగంలో సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరి మధ్య ఎన్నో పంతాలు, పట్టింపులు ఉండేవి. వాస్తవానికి కృష్ణ.. ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి స్టార్‌డం వచ్చాక ఎన్టీఆర్ తో పోటీపడ్డారు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా ఎన్నో సినిమాలు తీశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అలా ఎన్టీఆర్‌కు, కృష్ణకు మధ్య సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ ఆధిపత్య పోరు నడిచింది.

అలాగే ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ.. ఇటు కృష్ణ వారసుడు రమేష్ బాబు నటిస్తున్న సినిమాల టైటిల్స్ విషయంలోనూ ఇద్దరూ పంతానికి పోయారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా ఈ గొడవ ఏం జరుగుతుందా ? అని ఒకటే టెన్షన్ పడిపోయింది. బాలయ్య కెరీర్ లో 34వ‌ సినిమాగా సాహస సామ్రాట్ తెరకెక్కింది. కేసి. శేఖర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు తొలుత సామ్రాట్ అని పేరు పెట్టారు. అయితే కృష్ణ తనయుడు రమేష్ బాబు తొలి సినిమాకు కూడా ఇదే పేరు ఖరారు చేయటంతో.. టైటిల్ విషయంలో పెద్ద వివాదం తలెత్తింది. ఈ వివాదం 7 నెలలపాటు కొనసాగింది.

ఇద్దరు కూడా సామ్రాట్ టైటిల్ కావాలని పట్టుబెట్టారు. బాలయ్య సినిమా వెనక ఎన్టీఆర్.. అటు రమేష్ బాబు సినిమా వెనక కృష్ణ ఉండడంతో టైటిల్ విషయంలో ఎవరు వెనక్కు తగ్గలేదు. చివరకు పద్మాలయ కార్యాలయంలో హీరో కృష్ణ, సాహస సామ్రాట్ నిర్మాత కేసి శేఖర్ బాబు చర్చలు జరిపారు. చివరకు బాలయ్య సినిమాకు సాహస సామ్రాట్ అనే టైటిల్ పెట్టేందుకు శేఖర్ బాబు అంగీకరించారు. రమేష్ బాబు సినిమా టైటిల్ సామ్రాట్‌గా కొనసాగించారు.

ఈ గొడవ సద్దుమనగ‌డంతో అప్పట్లో ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఇక రాఘవేంద్రరావు, బాలయ్య కాంబినేషన్‌లో తయారైన సాహస సామ్రాట్ పూర్తిగా వినోదాత్మక చిత్రం. విజయశాంతి హీరోయిన్గా నటించారు. అయితే కథాబలం లేని కారణంగా ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. విచిత్రం ఏంటంటే అటు కృష్ణ తనయుడు రమేష్ బాబు నటించిన సామ్రాట్ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news