మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సలార్. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన సలార్ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఈ సినిమా అదనపు షోలు, టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల అనుమతుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. నైజాం వరకు తెలంగాణ ప్రభుత్వం సలార్ సినిమాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.
డిసెంబర్ 21న అర్ధరాత్రి 1 గంటకు స్పెషల్ షోలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదయం 4 గంటల షోలకు సైతం అనుమతి ఇవ్వడంతో ప్రభాస్ డైనోసార్‌గా బాక్సాఫీస్ దగ్గర గర్జించడం ఒక్కటే మిగిలిఉంది. మరో బంపర్ ఆఫర్ ఏంటంటే టికెట్ రేట్ల పెంపుపై సైతం అనుమతి లభించింది.
తెలంగాణలో వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి వచ్చేసింది. ఇది డిసెంబర్ 22 నుంచి 28 వరకు అమల్లో ఉంటుంది.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో రూ.250, 175, 100 రేట్లు, మల్టీఫెక్స్ ల్లో రూ. 370, రూ.470 ధరతో టికెట్ రేట్లు ఉండేలా కనిపిస్తోంది. అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేటు రూ.65 పెంచుకునేందుకు, మల్టీఫెక్స్ ల్లో రూ.100 తొలి వారం రోజులు పెంచుకునేలా అనుమతులు వచ్చాయి. ఇక ఏపీలో 10 రోజులపాటు 40 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి లభించినట్టు తెలుస్తోంది.
తెలంగాణలో మిడ్ నైట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన థియేటర్ల లిస్టులో ఒక్క హైదరాబాద్ సిటీలోనే 12 ఉన్నాయి. ఇందులో కూకట్‌పల్లి నుంచి 5 థియేటర్లు, క్రాస్ రోడ్స్ నుంచి 2, ఎర్రగడ్డ, మూసాపేట, దిల్‌సుఖ్‌నగర్ థియేటర్లు కూడా ఉన్నాయి. ఖమ్మం 2, మహబూబ్‌నగర్ 2, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్లో ఒక్కో థియేటర్‌కు కూడా అనుమతులు ఇచ్చారు.