యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ సలార్ ఈ నెల 22న థియేటర్లలోకి దిగుతోంది. సలార్‌పై దేశవ్యాప్తంగానే కనివినీ ఎరుగని రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్ టార్గెట్ రు. 800 కోట్లు అంటేనే ప్రభాస్ ఎంత భారీ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాడో తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సలార్ టిక్కెట్ల పెంపుతో పాటు అదనపు షోలు, మిడ్ నైట్ షోలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రభాస్ సినిమాకు బంపర్ ఆఫర్లు ఇచ్చేసింది. సలార్‌కు రు. 65, రు. 100 పెంచుకునేలా అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాను నైజాంలో పంపిణీ చేస్తోన్న మైత్రీ మూవీస్ వాళ్లు ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకోవడంతో ఈ అనుమతులు వచ్చాయి.
సింగిల్ స్క్రీన్లు, మల్టీఫ్లెక్సుల్లో వారం రోజుల పాటు ఈ టిక్కెట్ల పెంపు ఉంటుంది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు ఈ పెంపుదల ఉంటుంది. అలాగే 21వ తేదీ అర్ధరాత్రి దాటాక మిడ్నైట్ షోలకు కూడా అనుమతులు ఇచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పరిమిత థియేటర్లలో మాత్రమే ఈ షోలకు అనుమతులు ఇచ్చారు. మొత్తం 20 థియేటర్లలో మాత్రమే ఈ షోలకు అనుమతులు ఇవ్వనున్నారు. అలాగే మిగిలిన థియేటర్లలో రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచి కూడా ప్రత్యేక షోలు వేసుకోవచ్చు.
ఏదేమైనా రేవంత్ రెడ్డి సర్కార్ సలార్‌కు మామూలు గిఫ్ట్ ఇవ్వలేదు. ఇక ప్రభాస్ సినిమాకు టాక్ బాగుంటే బాక్సాఫీస్ దగ్గర కుమ్ముడు మామూలుగా ఉండదు.