తెలుగు సినీ పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ సినిమాల్లో ఎన్టీఆర్ పాతాళ భైరవి ఒకటి. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ పోటీపడి మరి నటించారు. ఉజ్జయిని రాకుమారి ( మాలతి ) ని ప్రేమించిన తోటరాముడు (ఎన్టీఆర్).. సర్వసంపన్నుడు కావటానికి నేపాల మాంత్రికుడు ( ఎస్వీ రంగారావు ) ను ఆశ్రయిస్తాడు. అయితే తోట రాముడిని బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలి అన్నది మాంత్రికుడు ఆలోచన. చివరకు మాంత్రికుడిని తోటరాముడు ఎలా మట్టు పెట్టాడు ? అన్నదే ఈ సినిమా కథాంశం.
ఈ సినిమాలో ముందుగా తోటరాముడు పాత్రకు అక్కినేని నాగేశ్వరరావుని, ఎస్వీ రంగారావు పోషించిన మాంత్రికుడు పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను తీసుకోవాలనుకున్నారట.. దర్శకుడు కె.వి.రెడ్డి. అయితే అనుహ్యంగా ఈ ఛాన్స్ ఎన్టీఆర్‌కు దక్కింది. ఒకరోజు వాహిని స్టూడియో ప్రాంగణంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ టెన్నిస్ ఆడుతున్నారట. అదే టైంలో దర్శకుడు కె.వి.రెడ్డి అక్కడికి వచ్చారు. రెండు, మూడు బంతులు రాకెట్‌కు తగలకపోవడంతో కోపం వచ్చిన ఎన్టీఆర్ రెండు చేతులతో బలంగా బంతిని బాధడంతో ఆ బంతి ఎవరికి కనిపించకుండా పోయింది.
అప్పుడు ఎన్టీఆర్ రాకెట్ పట్టుకున్న విధానం చూసిన దర్శకుడు కె.వి.రెడ్డి తోటరాముడు పాత్రకు ఏఎన్నార్ స్థానంలో ఎన్టీఆర్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యేది.. ఎస్విఆర్, ఎన్టీఆర్ లు అదే టైమ్‌కు వాహిని స్టూడియోకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఇసుక కోర్టులో సాధన చేసేవారు. ఈ మొత్తం కథంశాన్ని తాతినేని ప్రకాశరావు పర్యవేక్షించేవారట. ఆ తర్వాత వారికి రెండు ఇడ్లీ, ఒక వడ ఇచ్చేవారు.
అయితే ఎక్కువగా అలసిపోవటం వల్ల ఆ టిఫిన్ చాలదని ఎన్టీఆర్ అనడంతో తాతినేని ప్రకాష్ రావు ఆ టిఫిన్ రెట్టింపు చేశారట. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 250 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నారు. విజయ సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ముందుగానే ఒప్పందం జరిగింది. ఇక షూటింగ్ పూర్తిచేసుకున్న పాతాళభైరవి 1951 మార్చి 15న 13 ఫ్రింట్లతో విడుదలైంది. ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ తర్వాత 60 ప్రింట్లకు పెంచారు. మొత్తం 10 కేంద్రాల్లో శత దినోత్సవ జరుపుకుంది. అప్పట్లో ఇది ఒక రికార్డ్. మార్కస్ బార్‌ట్లే సినిమాటోగ్రఫీ – ఘంటసాల సంగీతం – గోకలే, కళాధర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి నిండుదనాన్ని తెచ్చాయి.