ఆంధ్ర, తెలంగాణలో బాలయ్య అంటే పడి చచ్చే అభిమానులు లక్షల్లోనే ఉంటారు. అలాంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో పల్లెటూర్లలో ఎక్కడైనా బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతోంది అంటే చాలు జనాలు వేలం వెర్రిగా ఎగబడి షూటింగుకు వెళతారు. ఒకప్పుడు పల్లెటూర్లలో షూటింగ్ అంటే చాలా చిత్ర విచిత్రంగా అంతా సందడి వాతావరనంగా ఉండేది. అందులోనూ బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతోంది అంటే చుట్టుపక్కల కనీసం 20 ఊళ్లలో పెద్ద సందడి వాతావరణం నెలకొనేది.
ఆ 20 గ్రామాలకు చెందిన ప్రజలు తండోపతండాలుగా షూటింగ్‌కు వెళ్లి బాలయ్యను చూసి ఆనందపడి వచ్చేవారు. 20 సంవత్సరాల క్రితం బాలయ్య నటించిన ఒక సినిమా షూటింగ్ గుంటూరు జిల్లాలో జరిగింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో గుంటూరు జిల్లాలో పలు డిపోల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు వేసి మరి బాలయ్య షూటింగ్‌కు అభిమానులను తీసుకువెళ్ళింది.
ఆ సినిమా ఏదో కాదు బాలకృష్ణ – బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు. గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలు షూట్ చేశారు. కోటప్పకొండ, సత్రశాల, కారంచేడు, మాచర్లలో జరిగిన షూటింగ్ నెల రోజులపాటు జరిగింది. వేలాదిమంది పౌరులు ఈ షూటింగ్‌ను.. బాలయ్యను చూసేందుకు తరలి వచ్చారు భారీ జన సందోహం మధ్య పలనాడు ప్రాంతంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.
ఈ షూటింగ్ చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో నరసారావు పేట నుంచి కోటప్పకొండకు, మాచర్ల, రెంటచింతల, పిడుగురాళ్ల డిపోల నుంచి సత్రశాల, కారంచేడుకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. అంచనాలకు మించి అభిమానులు ఆ షూటింగ్ చూసేందుకు వెళ్లినా కూడా.. ఆటంకాలు లేకుండా షూటింగ్ జరగటం విశేషం. అప్పట్లో ఇది ఒక సంచలనంగా నిలిచింది.