ప్రముఖ పీఆర్వో, సంతోషం పత్రిక అధినేత, జర్నలిస్ట్ సురేష్ కొండేటి తాజాగా గోవాలో నిర్వహించిన సంతోషం సినీ అవార్డ్ నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో నిర్వహించే ఈ ఈవెంట్‌ను ఈ సారి గోవాకు మార్చారు. ఏకంగా గోవా ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. చివర్లో ఈవెంట్ అంతా గందరగోళంగా మారింది.
గోవా ముఖ్యమంత్రి రాలేదు.. పైగా తెలుగు అవార్డుల కార్యక్రమం ముగిశాక.. స్టేజ్ మీదకు వెళ్లే మెట్లు తీసేయడం, లైట్లు ఆర్పేయడం లాంటివి జరిగాయంటున్నారు. ఇక ఇక్కడ నుంచి వెళ్లిన సెలబ్రిటీలకు కూడా ఫ్లైట్ టిక్కెట్లు సరిగా ఇవ్వలేదని.. చాలామంది రిటర్న్ ఫ్లైట్ టిక్కెట్లు వేసుకుని వెనక్కు వచ్చారని వార్తలు వస్తున్నాయి. కొందరికి పేమెంట్లు కూడా సరిగా చేయలేదనే అంటున్నారు.
ఓవరాల్‌గా ఫంక్షన్ అంతా అభాసుపాలు అయ్యింది. చివరకు కన్నడ ఇండస్ట్రీ అంతా తమ నటులకు అవమానం జరిగిందంటూ టాలీవుడ్‌పై విమర్శలు చేస్తోంది. దీనిపై అల్లు అరవింద్ స్పందించి అసలు సురేష్ కొండేటికి తమ ఫ్యామిలీకి సంబంధం లేదని.. అతడు మా ఫ్యామిలీలో ఎవ్వరికి పీఆర్వో కాదని.. ఎప్పుడో ఓ సారి ఫొటో దిగినంత మాత్రాన అతడు మా హీరోలకు ఎలా పీఆర్వో అవుతాడని.. ఫంక్షన్ ప్లాప్ అనేది అతడి వ్యక్తిగతం అంటూ కౌంటర్ ఇచ్చారు.
వాస్తవంగా సురేష్ కొండేటి చిరంజీవి ఫ్యామిలీకి ఎంత సన్నిహితంగా ఉంటాడో చెప్పక్కర్లేదు. చిరంజీవి సినిమాలకు ఎంతమంది పీఆర్వోలు ఉన్నా ఆయన కూడా తన వంతుగా ప్రమోట్ చేయడంతో పాటు అనధికారికంగా పీఆర్వోగానే ఉంటూ ఉంటారు. ఇంకా చిరంజీవి పర్సనల్‌గా చాలా పనులు చేస్తూ ఉంటాడని అంటూ ఉంటారు.
మెగా హీరోలు కూడా సురేష్ కొండేటికి ప్రత్యేకంగా గౌరవం ఇస్తూ ఉంటారు. ఇక అరవింద్ సురేష్‌కు తమ ఫ్యామిలీకి సంబంధం లేదని చెప్పినా కూడా సురేష్ మాత్రం తన సోషల్ మీడియా అక్కౌంట్లలో ఇంకా తాను మెగా పీఆర్వో అనే ట్యాగ్ లైన్‌నే కంటిన్యూ చేస్తున్నాడు. ఇక తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన సురేష్ అల్లు అరవింద్ వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. ఏదేమైనా అరవింద్ ఇచ్చిన కౌంటర్లను పట్టించుకోని సురేష్ తనకు తానుగా మెగా పీఆర్వోగానే ఉంటానని చెప్పకనే చెప్పేశాడు.