ఏప్రిల్ 1 విడుదల` ఇదొక గమ్మత్తయిన సినిమా. సినిమాలో జల్సారాయుడిగా.. అబద్ధాలపై అబద్ధాలు చెప్పుకొని రోజులు నెట్టుకొట్టే వీడియో క్యాసెట్ షాపు యజమానిగా నటించిన రాజేంద్రప్రసాద్ అద్భుతమైన హాస్యాన్ని జోడించారు. ఈ సినిమాలో ఇతర నటులు కూడా తమదైన నవ్వుల పంట పండించారు. ముఖ్యంగా జయలలిత, బట్టల సత్తి మధ్య జరిగే సన్నివేశాలు.. ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.
అయితే.. సినిమా టైటిల్ నుంచి మాటల వరకు.. కూడా దర్శకుడు వంశీ అనేక జాగ్రత్తలు తీసుకున్నారని.. ఈ సినిమా హిట్టయిన తర్వాత.. చాలా మంది చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఈ కథ వెనుక కూడా ఎంతో కష్టపడ్డారని చెబుతారు. కానీ వంశీ ఈ సినిమాను చాలా తేలికగా తీసుకున్నారని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్.. ఓ బారువాలా నుంచి దొంగిలించా
అని చెప్పుకోవడం గమనార్హం.
ముంబైలో టీ దుకాణాల నుంచి టీని తీసుకుని.. ఇతర ప్రాంతాల్లో విక్రయించేవారిని బారువాలా అంటారు. వీరు కప్పు టీకి 1 రూపాయి అదనంగా తీసుకుంటారు. ఓ సందర్భంలో తాను ముంబై వెళ్లినప్పుడు బారువాలా దగ్గర టీ తాగి.. 8 రూపాయలకు బదులుగా 10 రూపాయలు ఇచ్చినట్టు వంశీ చెప్పారు. అయితే.. అప్పటికి చిల్లర లేకపోవడంతో ఉంచుకోమని చెప్పినా.. చిల్లర సొమ్ము ఇచ్చేయాలని అనుకున్నాడు. కానీ, అతన వద్ద కూడా చిల్లర లేకపోవడంతో తర్వాత.. రెండు నెలలకు మళ్లీ తనను కలిసి.. ఇచ్చేశాడని చెప్పారు.
అతని నిజాయితీ తనకు నచ్చి.. వివరాలు అడిగితే.. పూస గుచ్చినట్టు అన్నీ చెప్పాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి నిజాయితీగా ఉంటే ఎలా ఉంటుంది? అని థాట్ వచ్చి ఏప్రిల్ 1 విడుదల కథ రాసినట్టు చెప్పుకొచ్చారు. మధ్యలో ప్రేమను కథలో చేర్చినట్టు తెలిపారు. మొత్తానికి ఈ సినిమా లేడీస్ టైలర్ అంత హిట్ కాకపోయినా.. నవ్వుల పంటగా మాత్రం మంచి మార్కులు సంపాయించింది.