బాలయ్య, శ్రీలీల, కాజల్ కీలకపాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా భగవంత్ కేసరి. దసరా కానుకగా గత నెల 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. బాలయ్య కెరీర్లోనే వరుసగా మూడో హిట్ సినిమాగా నిలిచింది. తాజాగా ఈ సినిమా యూనిట్ భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ దర్శకుడు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు హాజరయ్యారు. ఈ సక్సెస్ మీట్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య ఈ సినిమాలో తండ్రిగా నటించి ఎన్టీఆర్‌ను గుర్తు చేశాడు.. బాలయ్య ఎప్పుడో తండ్రి పేరు నిలబెట్టాడు. అందుకే ఆంధ్రప్రదేశ్ అంతటా జై బాలయ్య నినాదాలు వినిపిస్తున్నాయి అని అన్నారు. శ్రీలీల గురించి కొత్తగా ఏం చెప్పాలి ?.. ఆమె ఏదైనా అవలీలగా చేసేస్తోంది.. నటన అలాగే చేసింది. డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషన్లు అన్ని అద్భుతంగా చేస్తుందని ప్రశంసించారు. నేను శ్రీలీల మీద జామ పండు మాత్రమే వాడాను.. గ్లామర్‌గా, అల్లరిగా చూపించాను. కానీ అనిల్ రావిపూడి మాత్రం శ్రీలీలను అన్ని విధాలుగా వాడుకుని అన్ని కోణాల్లో చూపించాడని మెచ్చుకున్నారు.
అందుకు శ్రీలీల అనిల్‌రావిపూడికి ఎప్పటికి రుణపడి ఉండాలని చెప్పుకోచ్చారు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లిసందడి సినిమాతోనే శ్రీలీల తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. శ్రీలీలపై రాఘవేంద్రరావు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాయి.
ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్న శ్రీలీల త్వరలో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌కు జోడిగా నటించిన ఆది కేశవ్.. సంక్రాంతికి మహేష్ బాబు జోడిగా నటించిన గుంటూరు కారం.. డిసెంబర్లో నితిన్ కు జంటగా నటించినా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రానుంది.