తెలుగు చలన చిత్ర సీమలో రారాజుగా వెలుగొందినతెలుగు వారి అన్నగారు ఎన్టీఆర్.. వందల కొద్దీ సినిమా ల్లో తన విశ్వరూపం చూపించి.. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అనేక సినిమాల ద్వారా నూతన తరాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే.. ఇదే సినిమాలు అదే అన్నగారిని ఇరకా టంలోకి నెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. ఆయ న హవాను తగ్గించే ప్రయత్నాలు సాగాయి.
బలమైన కాంగ్రెస్ పార్టీని కేవలం 9 నెల్లలోనే అధికార పీఠం నుంచి తప్పించిన ఎన్టీఆర్‌ను నైతికంగా.. ప్రజలకు దూరం చేసేలా.. సినిమా ఫీల్డ్‌ను కాంగ్రెస్ వినియోగించుకుంది. సినీ ఫీల్డ్‌లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న కొందరు నటులను పురిగొల్పిన కాంగ్రెస్.. సినిమాలకు నిధులు కూడా అందించిం దనే టాక్ ఉంది. ఇలా.. వచ్చిన సినిమాలే మండలాధీసుడు, గండిపేట రహస్యం వంటివి. ఇవి అప్పట్లో ఎన్టీఆర్ పాలనను టార్గెట్ చేసుకుని వచ్చినవే.
1987లో వచ్చిన మండలాధీశుడు అప్పట్లో సంచలనం సృష్టించింది. కరణం వ్యవస్థను రద్దు చేసి.. మండలాల వ్యవస్థకు తీసుకురావడంతో రాష్ట్రంలో రాజకీయ చిత్రం మారిపోయింది. దీనిని టార్గెట్ చేస్తూ.. ఈ సినిమాను చిత్రీకరించారు. స్వయంగా అప్పటి నటుడు ప్రభాకర్‌రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం. అదేవిధంగా గండిపేటలో అన్నగారు ఆస్తులు పోగేసుకున్నారని.. అక్కడో సామ్రాజ్యం నిర్మించుకున్నారని.. ఆరోపిస్తూ.. తీసుకువచ్చిన సినిమానే గండిపేట రహస్యం.
ఈ సినిమా కూడా ఎన్నికలకు ముందు అన్నగారిపై ప్రభావం చూపుతుందని అందరూ అనుకున్నారు. కానీ, తన వాగ్ధాటి, ప్రజలకు చేసిన మంచి వంటి వాటిని ఎన్టీఆర్ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. దీంతో ఆయా సినిమాల ప్రభావం అన్నగారిపై అంతగా పడలేదనే చెప్పాలి. సో.. మొత్తానికి ఎన్నికల సమయంలో రాజకీయ సినిమాలు రావడం కొత్తకాదు. అయితే.. వాటి ప్రభావం పడకుండా చూసుకోవడమే ప్రధానం అంటున్నారు పరిశీలకులు.