టాలీవుడ్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇక సంక్రాంతి సినిమాలకు ముందు రకరకాల వార్తలు పుకార్లు.. షికారులు చేస్తూ ఉంటాయి. గత నాలుగైదు సంవత్సరాలుగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు థియేటర్ల కేటాయింపులు ఫ్రీ రిలీజ్ బిజినెస్ ల విషయంలో పెద్ద హంగామానే నడుస్తోంది. వచ్చే సంక్రాంతి లో కూడా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా మహేష్ బాబు గుంటూరు కారం. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు.. విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్. రవితేజ ఈగిల్, హనుమాన్, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించుకున్నాయి.
నైజంలో గుంటూరు సినిమాను దిల్ రాజు కొనేశారు. రూ.45 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ లెక్కన తీసుకున్నారని టాక్. అదే దిల్ రాజు – విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ సినిమా నిర్మిస్తున్నారు. ఇది కూడా సంక్రాంతికి అనే ప్రకటించారు. అయితే ఇక్కడ ఓ వ్యూహం దాగి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గుంటూరు కారం సినిమా నైజాంకు మాత్రమే రూ.45 కోట్లు అంటే చాలా పెద్ద రిస్క్. ఇండస్ట్రీ హిట్ అయిన అలవైకుంఠపురంలో సినిమాకే నైజాంలో రూ.42 కోట్ల షేర్ వచ్చింది. అంటే అంతకు మించిన హిట్ అవ్వాలి గుంటూరు కారం. అయితే ఈ సినిమాకు అంత సీన్ ఉందా అన్న సందేహం అందరిలోనూ ఉంది… అదే దిల్ రాజుకు కూడా ఉన్నట్టు కనిపిస్తోంది.
ఇలాంటి టైంలో వెంకటేష్, నాగార్జున, రవితేజ, విజయ్ దేవరకొండ సినిమాలతో పోటీ పడితే గుంటూరు కారంకు అనుకున్న స్థాయిలో స్క్రీన్లు దక్కవు. అందులోనూ తన బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కూడా రాజు రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడే ఓ మతలబు ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు కారం సినిమాను ఒకరోజు ముందుకు జరిపేశారు. జనవరి 11న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక తాను నిర్మాతగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తారని అంటున్నారు. అంటే గుంటూరు కారం సినిమాకు విజయ్ దేవరకొండ సినిమాకు మధ్యలో మూడు రోజులు టైం ఉంది.
ఇలా గుంటూరు కారం చాలావరకు రికవరీ అవుతుంది. అలా అయినా కూడా రవితేజ ఈగిల్, వెంకీ సైంధవ్ సినిమా రిలీజ్ అయితే మరికొన్ని స్క్రీన్లు ఆ సినిమాలకు తప్పకుండా ఇవ్వాలి. పైగా వెంకటేష్ సినిమాకు నైజాంలో సురేష్ బాబు, ఆసియన్ సునీల్ బ్యాకప్ ఉంది. వాళ్ళ థియేటర్లు వాళ్లకే ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి రేసులో ఉన్న మిగిలిన సినిమాలను పక్కకు తప్పించాలి అంటే సంక్రాంతికి బలమైన పోటీ తనకు తానే క్రియేట్ చేయాలి. ఇక్కడ దిల్ రాజు తన ఫ్యామిలీస్టార్‌తో అదే చేశాడు. రెండు పెద్ద సినిమాలు అంటే రవితేజ, నాగార్జున సినిమాలు సంక్రాంతి నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఈగిల్ జనవరి 26 కు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
హనుమాన్ కూడా ఫిబ్రవరికి మారుస్తారని ప్రచారం ఉంది. ఇక అప్పుడు వెంకటేష్ సైంధవ్, మహేష్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ ఫ్యామిలి స్టార్ సినిమాలు మాత్రమే సంక్రాంతి రేస్‌లో ఉంటాయి. అప్పుడు చాలా తెలివిగా విజయ్ దేవరకొండ సినిమాని కూడా ఫిబ్రవరి వరకు వాయిదా వేసుకుంటే గుంటూరు కారం, వెంకటేష్ సినిమాల మాత్రమే పోటీలో ఉంటాయి. అప్పుడు గుంటూరు కారంకు సైంధవ్ సినిమా ఏ మాత్రం పోటీ కాదు. గుంటూరు కారం చాలా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఇదంతా చాలా తెలివిగా దిల్ రాజు వేసిన స్ట్రాటజీగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాజు ఎంత స్ట్రాటజీ వేసినా రవితేజ, నాగార్జున, హనుమాన్ సినిమాలు కూడా సంక్రాంతి లో ఉంటే అప్పుడు అసలు సిసలు మజా ఉంటుందని చెప్పాలి.