కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమా లియో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంతకుముందు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన నగరం – ఖైదీ – మాస్టర్ విక్రమ్ సినిమాలు సూపర్ హిట్ అవడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ దర్శకుడికి తెలుగులో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
అటు విజయ్ లాంటి స్టార్ హీరో కావడంతో పాటు… ఇటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో లియోపై రిలీజ్ కి ముందే అంచనాలు మామూలుగా లేవు. తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి – రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీలో ఉన్నా కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ కి వచ్చాయి. ఈ సినిమా కేవలం తెలుగు భాష వరకు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మూడు రోజులకు 32 కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టింది. ఇది నిజంగా సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి.
సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. విజయ్‌కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటించగా ప్రియా ఆనంద్ మరో హీరోయిన్గా కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, తమిళ దర్శకులు గౌతమ్ మీనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచంద్ర ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఏది ఏమైనా విజయ్‌కు తెలుగులో తుపాకీ తర్వాత ఆ స్థాయిలో తిరుగులేని హిట్ లియోతో దక్కిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.