సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో, హీరోయిన్ల మధ్య ఇగోలు, పంతాలు, పట్టింపులు మామూలే. ఇవి ఇప్పటినుంచే కాదు గత కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నాయి. అప్పట్లో సీనియర్ హీరోయిన్ జమున ఏఎన్ఆర్ ను అస్సలు లెక్క చేసేవారు కాదట. దీంతో జమునను బ్యాన్ చేయాలని ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పై ఒత్తిడి తెచ్చి రెండేళ్లపాటు జమునను తమ సినిమాలలో హీరోయిన్గా లేకుండా చేశారన్న ప్రచారం ఉంది.
ఆ తర్వాత చిరంజీవి, విజయశాంతి – చిరంజీవి, శ్రీదేవి ఇటీవల కాలంలో సాయి పల్లవి – నాని మధ్య కూడా షూటింగ్ టైంలో ఇగోలు పంతాలు నడిచాయి. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగలు సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకు శ్రీదేవి నిర్మాత.. రెండు షెడ్యూల్స్ కూడా జరిగాయి. అయితే కథ విషయంలో తాను చెప్పినట్టు మార్చాలని శ్రీదేవి ఒత్తిడి చేయడంతో శ్రీదేవి – చిరంజీవి మధ్య ఇగోలు నడిచాయి. చివరిగా సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.
అలాగే చిరంజీవి – విజయశాంతి మధ్య ఇగోలు, పంతాలు, పట్టింపులతో షూటింగ్ నడిచిన ఒక సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలో వీరిద్దరి పంతాలతో దర్శకుడు కూడా వీరి మధ్య సమన్వయం చేయలేక తల పట్టుకున్నారట. ఆ సినిమా ఏదో కాదు స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రలతో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పటికే యండమూరి చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలుకు కథలు అందించారు.
ఈ క్రమంలోనే ఆయనకు నీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ కోసమే యండమూరితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా తెరకెక్కించారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే విజయశాంతి – చిరంజీవికి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి అంటారు. ఒకరోజు చిరంజీవి షూటింగ్ కి వస్తే విజయశాంతి డుమ్మా కొట్టే వారు.
విజయశాంతి షూటింగ్లో ఉంటే చిరంజీవి వచ్చేవాడు కాదట. షూటింగ్లో ఇద్దరు కలిసి పాల్గొనే సన్నివేశాలు ఉన్నా ఎడమొఖం పెడముఖంగా ఉండేవారట. అసలు ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదని అంటారు. చివరికి యండమూరికి దర్శకత్వపరంగా అనుభవం లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.