మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కనుకుగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఇది ఎలా ఉంటే నాలుగైదు రోజులుగా చిరంజీవి, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ సైతం తనకు చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న కోరిక ఉందని చెప్పారు.
చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమాకు కూడా త్రివిక్రమ్ పనిచేశారు. అయితే ఆ సినిమా హిట్ కాలేదు. ఆ తర్వాత ఓ వేడుకలో త్రివిక్రమ్ స్వయంగా చిరంజీవితో తన సినిమా ఉంటుందని ప్రకటించారు. ఇది జరిగి కూడా చాలా ఏళ్లవుతుంది.ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఉన్నట్టుండి ఖైదీ వస్తుందని దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. చిరంజీవి ని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఖైదీ.
ఈ సినిమాకు సీక్వెల్‌గా చక్కని కథని త్రివిక్రమ్ సిద్ధం చేశారని.. ఈ కాంబినేషన్ లోనే ఖైదీ 2 రాబోతుందంటూ రకరకాల ప్రచారం జరుగుతోంది. దీంతో సహజంగానే మెగా అభిమానులు ఊహల్లో మునిగి తేలుతున్నారు. అయితే ఇప్పటిలో ఇవన్నీ జరిగే పనులు కావు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కొరసాల కళ్యాణకృష్ణ, బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్ట్ చేసే సినిమాలు మరో రెండేళ్లు పట్టేలా ఉన్నాయి.
వాటితో పాటు అనిల్ రావిపూడి కూడా ఓ కథ చెప్పి చిరంజీవిని ఒప్పించారు. ఇవన్నీ పూర్తయ్యేసరికి 2025 మిడిల్ వచ్చేస్తుంది. ఇటు త్రివిక్రమ్ కూడా ఖాళీగా లేడు గుంటూరు కారం తర్వాత బన్నీతో ఓ సినిమా ఉంది. ఆ వెంటనే ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. రామ్‌చరణ్ అయితే త్రివిక్రమ్ కోసం ఎప్పటినుంచో కాచుకుని ఉన్నాడు.
ప్రభాస్ కూడా ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం ఆరాటపడుతున్నాడు. అంటే త్రివిక్రమ్ ఐదు సినిమాలు పూర్తి చేయాలి. అప్పటికి గానీ చిరుతో సినిమా ఉండదు. ఇవన్నీ పూర్తి అయ్యేసరికి అప్పటికి రాజా ఎవరో మంత్రి ఎవరో ? అన్నట్టుగా ఉంటుంది. అంటే కనీసం మూడు నుంచి నాలుగు ఏళ్ల తర్వాత గానీ చిరు త్రివిక్రమ్ సినిమా వచ్చే ఛాన్సులు లేవు.