ఏరువాక సాగారో రన్నో చిన్నన్న అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటి వహీదా రెహమాన్. తాజాగా ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. భారతీయ సినిమా పరిశ్రమకు ఐదు దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను ఆమెను ఈ పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వహీదా రెహమాన్ ముందుగా టాలీవుడ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.
ఎన్టీఆర్ జయసింహా సినిమాలో రాజకుమారి పాత్రలోనూ మెరిసింది. 1955 లో వచ్చిన రోజులు మారాయి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఏరువాక సాగారో రన్నోపాట ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది.
ఆమె అందానికి, నటనకు ఫిదా అయిన గురుదత్ సిఐడి సినిమాలో హీరోయిన్గా ఎంపిక చేశారు.
వహీదా అందానికి ముగ్ధుడు అయిన డైరెక్టర్ గురుదత్ హీరోగా అవతారం ఎత్తాడు. వహీదా కోసం ప్యాసా సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ముందుగా హీరో దిలీప్ కుమార్.. అయితే వహీదా హీరోయిన్గా చేస్తుందని తెలియడంతో దిలీప్‌ను తప్పించి తానే హీరోగా నటించాడు గురుదత్. ఆ తర్వాత వారిద్దరు ప్రేమలో పడ్డారు. అయితే అప్పటికే గురుదత్తుకు సింగర్ గీతా దత్తుతో పెళ్లి జరిగింది.. పిల్లలు కూడా ఉన్నారు.
గురుదత్ – వహీదా ప్రేమలో పడడంతో పాటు తనకు విడాకులు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అనే విషయం గీతాకు తెలిసింది. దీంతో ఆమె తన పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. అయితే భార్య పిల్లల కోసం తన ప్రేమను త్యాగం చేసిన గురుదత్ వహీదాను దూరం పెట్టాడు. ప్రేమ విఫలం కావడంతో వహీదా కుంగిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయింది. దేవానంద్‌తో ఎక్కువ సినిమాలు చేయడంతో అతనితో ప్రేమలో పడిందని పుకార్లు కూడా వచ్చాయి. 1974లో బాలీవుడ్ నటుడు శశిరేఖిని పెళ్లి చేసుకుని సోహైల్ రేఖీ, కాశీరేఖీ అనే పిల్లలకు జన్మనిచ్చింది. 2000 సంవత్సరంలో శశిరేఖి చనిపోయాడు. ప్రస్తుతం వహీదా ముంబైలో తన పిల్లలతో కలిసి ఉంటుంది.