టాలీవుడ్ లో ఈ దసరాకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. ఈ మూడు సినిమాలలోను ముగ్గురు స్టార్ హీరోలు నటించడం విశేషం. ఆ హీరోల్లో ఇద్దరు తెలుగు హీరోలు కాగా. ఒకరు కోలీవుడ్ స్టార్. మన టాలీవుడ్ నుంచి నందమూరి నటసింహం బాలయ్య, మాస్ మహారాజ్ రవితేజ బరిలోకి దిగుతుంటే.. కోలీవుడ్ నుంచి స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ సినిమా రంగంలోకి దిగుతోంది.
అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా దసరా సీజన్లో రాబోతున్న ఈ మూడు సినిమాలకు భారీ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా వస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా థియేటర్లోకి దిగుతుంది. భగవంత్ కేసరి బాలయ్య కెరీర్ లోనే అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా రు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య కెరీర్ లో ఇది హైయెస్ట్ కావటం విశేషం.
ఇక మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రు. 40 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు కోలీవుడ్ హీరో విజయ్ లియో సినిమాతో అక్టోబర్ 19న బరిలోకి దిగుతున్నాడు. విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమా కూడా ఏపీ, తెలంగాణలో రు. 22 కోట్ల బిజినెస్ చేసింది.
ఇది విజయ రేంజ్ కు తెలుగులో కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఏది ఏమైనా ఈ మూడు సినిమాలపై డిస్ట్రిబ్యూటర్లు, ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలతో ఉన్నాయి. మరి ఈ మూడు సినిమాలలో బాలయ్య సినిమా ఏకంగా రు. 80 కోట్ల బిజినెస్ తో పై చేయి సాధించింది. రేపు థియేటర్లలో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.