విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఖుషి సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.
ప్రపంచ వ్యాప్తంగా ఖుషి థియేటర్ హక్కులను రు. 53 కోట్లకు అమ్మినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా బిజినెస్ జరిగింది. అయితే విజయ్ గత సినిమా లైగర్‌తో పోలిస్తే ఖుషి సినిమాకు చాలా తక్కువగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్పాలి. లైగర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 90 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేశారు. ఆ సినిమాతో పోలిస్తే దాదాపు రు. 40 కోట్లు తక్కువగానే ఖుషి హక్కులు అమ్మారు.
నైజంలో ఖుషి థియేటర్ హక్కులను 15 కోట్లకు అమ్మారు. సీడెడ్లో 6 కోట్లు.. ఆంధ్రాలో అన్ని ఏరియాలో కలిపి 20 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపితే మొత్తం ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 40 కోట్లు జరిగింది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ ద్వారా ఐదు కోట్లు ఓవర్సీస్ రైట్స్ ద్వారా ఏడు కోట్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 53 కోట్లు జరిగింది అంటే విజయ్ సమంత ముందు రు. 53 కోట్ల షేర్ టార్గెట్ గా ఉంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో సింపుల్ గానే ఈ టార్గెట్ రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.