నటీనటులు : పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజ్, నాజర్, సునీల్, రఘుబాబు తదితరులు.
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్
ఎడిటింగ్ : ప్రవీణ్ కే ఎల్
సంగీతం : ఎం ఎం కీరవాణి
నిర్మాణం : మెగా సూర్య ప్రొడక్షన్స్
దర్శకుడు : క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ
రిలీజ్ డేట్: 24 జూలై , 2025
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని పలుమార్లు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు గత రాత్రి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతోన్న తొలి సినిమా కావడంతో అంచనాలు మామూలుగా లేవు. మరి వీరమల్లు ఏం చేశాడు.. ప్రేక్షకులను ఎలా మెప్పించాడు అన్నది సమీక్షలో చూద్దాం.
కథ :
1650లో కొల్లూరు వజ్రాల గనిలో వెలికి తీసిన కోహినూర్ వజ్రం ఔరంగజేబు ( బాబీ డియోల్) చెంతకి చేరుతుంది. భారతీయులను క్రూరంగా నలిపే అతని ఆగడాలను అడ్డుకునేందుకు గోల్కొండ నవాబ్ కుతుబ్ షా ఓ విప్లవకారుడిని ఆశ్రయిస్తాడు – అతనే హరిహర వీరమల్లు (పవన్ కళ్యాణ్). వజ్రాలను దొంగిలించడంలో ప్రావీణ్యం ఉన్న వీరమల్లు, కోహినూర్ కోసం కాక మరో పెద్ద లక్ష్యంతో ఔరంగజేబును సమర్థంగా ఎదుర్కొంటాడు. అతని గతం, గుండెల్లో ఉన్న బాధ, ధైర్యం – ఇవన్నీ కథలో ప్రధానంగా ముందుకు నడిపిస్తాయి. ఈ క్రమంలోనే అతడికి పంచయి ( నిధి అగర్వాల్)తో ఏర్పడిన పరిచయం ఏమైంది ? ఆమె ఇచ్చిన ట్విస్ట్ ఏంటి ? వీరకు కోహినూర్ కావాలా, కక్ష తీర్చుకోవాలా అనేది మరిచి, మనమంతా వెండితెరపై వీరమల్లుని ప్రయాణాన్ని చూడాల్సిందే.
విశ్లేషణ :
నాలుగేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కోరికకు తెరదించుతూ “హరిహర వీరమల్లు” బిగ్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమా మొత్తం ఒక మాస్ ట్రీట్మెంట్ తో, ఊహించని ఎలివేషన్స్, క్రేజీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. ప్రతి సీన్‌లోనూ పవన్ కళ్యాణ్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనపై తీసిన యాక్షన్ బ్లాక్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను టచ్ చేశాయి. పాటలు, ఫైట్స్ కథనానికి తగినట్లుగా వస్తూ సినిమాను బలంగా ముందుకు నడిపించాయి. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ భాగాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. సనాతన ధర్మం కోసం జరిగే పోరాటం, అప్పట్లో జరిగిన హృదయ విదారక సంఘటనల బాగా తెరకెక్కించారు. ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
నటీనటుల పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో తన లోని కొత్త కోణాన్ని బయటపెట్టారు. గత కొన్ని సినిమాల్లో కనిపించని విభిన్న పవన్‌ను ఈ చిత్రంలో చూస్తాం. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన ఈ పాత్రను అత్యద్భుతంగా నటించారు. హీరోయిన్ నిధి అగర్వాల్ తన పాత్రలో ఆకట్టుకున్నారు. ఆమెకి ఉన్న ట్విస్ట్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ గా మారుతుంది. రఘుబాబు, సునీల్, నాజర్, సుబ్బరాజు వంటి వారు నవ్వులపాలిట్విస్ట్ అందిస్తూ మెప్పించారు. బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించి ఓ పవర్ఫుల్ నెగటివ్ రోల్‌తో ఆకట్టుకున్నారు. “ఔరంగజేబ్ అంటే ఇలా ఉంటాడు” అనే అభిప్రాయాన్ని ఆయన నటనతో నమ్మించగలిగారు.
హరిహర వీరమల్లు” సినిమాలో మంచి పాయింట్ ఉండగా, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల కథనం ఊహాజనితంగా సాగుతూ, అంతగా కనెక్ట్ కాలేని విధంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో మాస్, ఎలివేషన్ మూమెంట్స్ కొంత డల్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో నరేడ్ చేసిన ఎనర్జీని, ఇంటెన్సిటీని సెకండాఫ్ ప్రారంభంలో కూడా కొనసాగించి ఉంటే ఇంకా బెటర్ అయ్యేది. విజువల్ ఎఫెక్ట్స్ సినిమా స్థాయికి ఏమాత్రం సరిపోలేలా లేవు. కొన్ని సన్నివేశాల్లో చూపించిన గ్రాఫిక్స్ చాలా వర్క్ అవుట్ కాలేదు. అక్కడ జరిగే సీన్లకి చూపించిన విజువల్స్ కి పొంతన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. సెకండాఫ్‌లో క్లైమాక్స్ మినహా మిగతా గ్రాఫిక్స్ పార్ట్‌స్ చాలా వీక్‌గా ఉండడం, సినిమాపై పెట్టుకున్న అంచనాలకు కొంత డ్యామేజ్ చేసింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ మీద పని చేసిన మేకర్స్, విజువల్స్ విషయంలో మాత్రం నిరాశ పరిచారు. కంటెంట్ కొత్తగా, బలంగా ఉన్నా, కథన శైలి, గ్రాఫిక్స్ పరంగా కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
హరిహర వీరమల్లు నిర్మాణ విలువలు చూస్తే కొన్ని అంశాల్లో భలే బాగుండగా, మరికొన్నింటిలో మాత్రం లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తాయి. పీరియాడిక్ డ్రామాకి తగినట్టుగా తీసుకున్న ప్రొడక్షన్ డిజైన్, భారీ సెట్టింగ్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. గ్రాండియర్ లుక్ కోసం వేసిన మాన్యూమెంట్స్, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయి. కొన్ని కీలక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాసిరకంగా .. దారుణంగా ఉన్నాయి. సెకండాఫ్ లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
టెక్నీషియన్స్ విషయానికి వస్తే, మొదటగా చెప్పుకోవాల్సింది ఎంఎం కీరవాణి గురించే. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం లాంటిది. ప్రతి కీలక ముమెంట్లో ఆయన సంగీతం ఎమోషన్ కి మరో స్థాయిని తీసుకెళ్లింది. కొన్ని సీన్లలో స్కోర్ పూర్తిగా సినిమాని ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. పవన్ కళ్యాణ్ ని రిచ్ షాట్స్ లో చూపిస్తూ, విజువల్స్‌కి నయమైన లుక్ ఇచ్చారు. ఆయన ఎంట్రీలలో, యాక్షన్ పార్ట్స్ లో కెమెరా వర్క్ ఆకట్టుకుంది.
ఎడిటింగ్ విషయంలో మాత్రం సెకండాఫ్‌లో కొంత మరింత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సీన్లు డ్రాగ్ అయ్యాయి, కొన్ని తడబాటుగా సాగినట్లు అనిపించవచ్చు. దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు సినిమాకి గట్టి బేస్ ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ లో కంఫిడెన్స్ కనిపిస్తుంది. మొదటి భాగాన్ని ఆకట్టుకునేలా తీసుకెళ్లినా, సెకండాఫ్‌కి మరింత ఫోకస్ ఇస్తే బాగుండేదని అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ప్లాట్‌గా, అనాసక్తిగా ఉంటుంది. క్రిష్ కథ, క్రిష్ తీసిన సీన్లు బాగున్నా… జ్యోతికృష్ణ పవన్‌ను సరిగా డీల్ చేయలేకపోయాడనిపిస్తుంది. ఓవరాల్‌గా టెక్నికల్‌గా సినిమాకి ఉన్న పటిష్టత స్పష్టంగా కనిపించినా, కొన్ని కీలక విభాగాల్లో ఇంకా కాన్‌సంట్రేషన్ చేయాల్సింది.
ఫైనల్‌గా..
ఓవరాల్‌గా చూస్తే “హరిహర వీరమల్లు” ఒక సనాతన ధర్మం కోసం జరిగిన యుద్ధానికి ప్రతీకగా నిలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో తాండవం చేశాడు. పీరియాడిక్ ప్రపంచంలోకి ప్రేక్షకులను నిమగ్నం చేసే విధంగా తీసుకెళ్లడంలో టీం సక్సెస్ అయింది. సినిమాలోని ఎమోషనల్ మూమెంట్స్, పవన్ పై వచ్చిన సాలిడ్ ఎలివేషన్ సీన్లు, ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాకి వెన్నెముకగా నిలిచాయి. సెకండాఫ్‌లో కొన్ని చోట్ల సో-సో మూమెంట్స్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా వచ్చే డిజప్పాయింట్‌మెంట్స్ సినిమాకి కొంత నెగటివ్ పాయింట్‌లుగా నిలిచాయి. అయినా, వాటిని పక్కనపెడితే మిగతా అంశాలు బాగున్నాయని చెప్పొచ్చు.
ఫైనల్ పంచ్ : వీరమల్లు పార్ట్ 1 ఒక డీసెంట్ అండ్ ఎంగేజింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా
హరిహర వీరమల్లు రేటింగ్ : 2.75 / 5