టైటిల్: డాకూ మహారాజ్
బ్యానర్: సితార ఎంటర్టైన్‌మెంట్స్ – ఫార్యూన్ ఫోర్ సినిమాస్ – శ్రీకర స్టూడియోస్
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ప్రగ్య జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబీ డియోల్ తదితరులు
డైలాగ్స్: భాను – నందు
యాక్షన్: వి. వెంకట్
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటింగ్: నిరంజన్ – రూబెన్
మ్యూజిక్: థమన్
నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ – సాయి సౌజన్య
స్క్రీన్ ప్లే: చక్రవర్తి రెడ్డి
దర్శకత్వం: కే బాబి
సెన్సార్ రిపోర్ట్ : యూ / ఏ
రన్ టైం: 157 నిమిషాలు
వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్: 83 కోట్లు
రిలీజ్ డేట్: 12, జనవరి, 2025
పరిచయం:
ప్రస్తుతం తెలుగు ప్రజల ఎక్కడ ఉన్నా .. తెలుగు సినీ ప్రేమికులు ఎక్కడ ఉన్నా వారి నోట కామన్‌గా వినిపించే నినాదం జై బాలయ్యా.. థియేటర్లలో ఏ హీరో సినిమా ఆడుతున్నా.. తెలుగు ప్రజలు ఏ ఫంక్షన్‌లో ఉన్నా.. ఏ సంబరాల్లో ఉన్నా కూడా జై బాలయ్యా అనాల్సిందే. అదో నినాదం అయిపోయింది ఇప్పుడు. బాలయ్య ఈ వయస్సులోనూ తెలుగు ప్రజల హృదయాల్లో అలా గూడు కట్టేసుకున్నారు. చాలా యేళ్ల తర్వాత అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి లాంటి మూడు వరుస హ్యాట్రిక్ హిట్లతో ఇటు బుల్లితెరపై అన్‌స్టాపబుల్ బ్లాక్‌బస్టర్‌తో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమాకు బాబి దర్శకుడు.. భారీ అంచనాలతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్‌కు ఈ సినిమాతో శ్రీకారం చుడతారన్న అంచనాలతో డాకూ మహారాజ్ ఈ రోజు థియేటర్లలోకి దిగింది. మరి డాకూ తో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర గర్జించాడా ? లేదా ? అన్నది సమీక్షలో చూద్దాం.
కథ:
నానాజీ (బాలకృష్ణ) మదనపల్లె హిల్ స్టేషన్లోని సంపన్న కుటుంబంలో ఒక యువతిని రక్షించడానికి వస్తాడు. ఇదే టైంలో సీతారాం (బాలకృష్ణ).. అతడి భార్య (ప్రగ్యా జైస్వాల్) మధ్యప్రదేశ్-రాజస్థాన్ ప్రాంతంలో నీటిపారుదల ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తుంది, వీరు మార్బుల్ మైనింగ్ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ గ్రామస్తులు నీళ్లు లేకుండా అల్లాడుతున్నప్పుడు సీతారామ్ వారికి అండగా నిలిచే క్రమంలో ఠాగూర్ కుటుంబం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి… చివరకు సీతారాం డాకూ మహారాజుగా ఎలా మారాడు.. ఈ కథలో కలెక్టర్ ( శ్రద్ధ శ్రీనాథ్ ) పాత్ర ఎందుకు కీలకం ? ఈ పోరాటంలో డాకూ ఏమయ్యాడు ? నానాజీకి.. డాకూ ఉన్న లింక్ ఏంటన్నదే ఈ సినిమా కథ.
TL విశ్లేషణ & డైరెక్షన్ :
ప్రమోషన్లలో ఇది జైలర్ – విక్రమ్ రేంజ్ తరహా సినిమా అన్నప్పుడు అంత సీన్ ఉంటుందా ? అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈ రోజు సినిమా చూస్తుంటే కథ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే ఎలివేషన్లు.. ఆ సీన్లకు పడ్డ బీజీఎం చూస్తుంటే నిజంగానే థియేటర్లలో పూనకాలు.. గూస్‌బంప్స్ మోత మోగిపోయింది. కథలో కొత్తదనం లేదు.. అందులో డౌట్ లేదు.. డాకూ మహారాజ్ క్యారెక్టర్ రాసిన విధానం కన్నా తెరమీద తీసిన తీత చూస్తుంటే మైండ్ బ్లోయింగ్.. కథంతా దాదాపు ఊహించిందే.. సినిమా తొలి పది నిమిషాల్లో ముందుకు కదలదు.. తర్వాత స్పీడప్ అవుతుంది. బాబి గేర్ మార్చేశాడు.. అక్కడ నుంచి స్పీడప్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఊచకోతతో వెళ్లిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఊచకోత కోసిపడేశాడు బాబి. సెకండాఫ్‌లో కాస్త స్లో అయినా ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. ఇసుక తుఫాన్ ఎపిసోడ్.. చంబల్ వ్యాలీ సీన్లతో వచ్చిన ఊపును క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేయలేకపోయాడు.. క్లైమాక్స్ ప్లాట్ పడిపోయింది. బోయపాటి – బాలయ్య సినిమా అంటే ఊరమాస్.. కానీ బాలయ్యను స్టైలీష్‌గా అదే మాస్ కోణంలో చూపిస్తే ఎలా ఉంటుందో అదే బాబి చేసి చూపించాడు. ఇటు మాస్‌ను ఆకట్టుకుంటూ.. అటు స్టైలీష్‌గా సినిమాను ప్రజెంట్ చేయడంలో బాబి అతి పెద్ద ఛాలెంజ్‌ను బాగా పూర్తి చేశాడు. చాలా సీన్లు ఎడ్జ్ ఆఫ్ ద సీట్… హై యాక్షన్ మూమెంట్స్‌తో పిచ్చెక్కిస్తాయి. చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉన్నా… రచయితగా బాబి సృజనాత్మకంగా ఊహించలేకపోయాడు. చాలా సీన్లు మనం ఊహించేస్తాం.. ఎన్ని కంప్లైంట్లు ఉన్నా.. డాకూ మహారాజ్ క్యారెక్టర్.. కళ్లు చెదిరే ఎలివేషన్లు.. థమన్ బీజీఎం సినిమాను ఓ రేంజ్‌కు తీసుకువెళ్లి థియేటర్లలో సినిమా చూస్తున్నంత సేపు పూనకాలు తెప్పించాయి. సినిమా విజయాన్ని ఏ కంప్లైంట్ కూడా ఆపలేదు.
నటీనటుల పెర్పామెన్స్ :
బాలకృష్ణ డాకూ మహారాజ్‌గా.. ఇటు నానాజీగా అదరగొట్టేశాడు. డాకూ మహారాజ్‌గా నట విశ్వరూపం చూపిస్తే… నానాజీగా తన మామూలు భారీ డైలాగులు.. నటనకు భిన్నంగా సింపుల్ నటనతో సహజత్వంతో ఆకట్టుకున్నాడు. చాలా బ్యాలెన్స్‌డ్ పెర్పామెన్స్ ఇచ్చాడు. ఠాకూర్‌గా బాబీడియోల్ పాత్ర క్రూరంగానే ఉన్నా బాలయ్య ధీటుగా ఈ పాత్ర రాసుకోలేదు. ఇంకా వాడుకుని ఉండాల్సింది. ప్రగ్య జైశ్వాల్ బాలయ్య భార్య పాత్రలో సెకండాఫ్ లో ఆమెకు మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ కలెక్టర్‌గా.. ఎమోషనల్‌గా ఆమె పాత్ర ముగింపు బాగుంది. ఊర్వశీ రౌతేలా ఓ ఐటెం సాంగ్‌తో సరిపెట్టేసుకుంది.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్‌గా సినిమా విజయంలో థమన్‌దే కీలకపాత్ర.. అసలు బీజీఎం లేకపోతే సినిమాను ఊహించుకోలేం… అఖండ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ బాలయ్యకు మాత్రమే తాను ఎందుకు ? అంత పెద్ద ఫ్యానో.. బాలయ్య సినిమాలకు ఎందుకంత స్పెషలో మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు. విజయ్ కన్ణన్ సినిమాటోగ్రఫీ కలర్ టోనింగ్ అదిరిపోయింది. సితార నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. నాగవంశీ పెట్టుబడి విషయంలో రాజీపడకుండా రిచ్‌గా నిర్మించాడు. ఎడిటింగ్ సెకండాఫ్‌లో కొన్ని కంప్లైంట్లు ఉన్నా అది పెద్ద సమస్య కాదు.
డాకూ మహారాజ్ సినిమా దాని సూపర్ స్టైలీష్ యాక్షన్ సీన్లు.. హై స్పీడ్ స్క్రీన్ ప్లే చాలా స్పెషల్. దర్శకుడు బాబి రొటీన్ కథే రాసుకున్నాడు. కానీ హై స్పీడ్ స్క్రీన్ ప్లే … మాస్ ఆడియెన్స్ ను పిచ్చెక్కించే ఆరేడు బ్లాక్‌లు నిజంగా బాలయ్య, మాస్ ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. ఈ సినిమా అందరు హీరోల మాస్ ఆడియెన్స్ ను పిచ్చెక్కించడం ఖాయం.. అలాగే జై బాలయ్య స్లోగన్‌ను కంటిన్యూ చేస్తుంది. ఈ సంక్రాంతిక పండగకు నిజమైన మాస్ పండగే అని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ ( + ) :
– డాకూగా బాలయ్య విశ్వరూపం
– చక్రవర్తి రెడ్డి స్క్రీన్ ప్లే
– రేసీ – స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్‌లు
– సినిమాటోగ్రఫీ
– సినిమాలో ఫస్ట్ హైలెట్ థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ ( – ) :
– రొటీన్ స్టోరీ
– ప్లాట్ క్లైమాక్స్
ఫైనల్‌గా…
ఓ రొటీన్ స్టోరీలో డాకూ మహారాజ్ అనే పాత్రను బలంగా తెరకెక్కించాడు దర్శకుడు బాబి. థమన్ నేపథ్యం సంగీతం సినిమాకు ఫస్ట్ హైలెట్… ఇది బాలయ్యతో సహా దాదాపు అందరిని డామినేట్ చేసే రేంజ్‌లో ఉంది. ఫస్టాఫ్‌తో పాటు పలు కీలక సన్నివేశాల రేంజ్‌ను నేపథ్య సంగీతం ఎలివేట్ చేసింది. మ్యాజిక్ చేసిన స్క్రీన్ ప్లే… అయితే రొటీన్ కథ.. ఊహించే సెకండాఫ్.. ప్లాట్ క్లైమాక్స్ .. బాబి బలహీన రచన సినిమా స్తాయిని తగ్గించాయి. అయితే పండగకు అదిరిపోయే మాస్ విందు భోజనం డాకూ మహారాజ్.
డాకూ మహారాజ్ ఫైనల్ పంచ్ : డాకూగా బాలయ్య నట విశ్వరూపం
డాకూ మహారాజ్ TL రేటింగ్: 3 / 5