పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఓజీ. ఈ సినిమాను ముందుగా వచ్చే మార్చిలో విడుదల అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ తేదీకి హరిహర వీరమల్లు వస్తోంది. అందువల్ల ఓ జి సినిమా 2025 ఆగస్టు తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ లోగా ఈ సినిమా థియేటర్ హక్కులు మార్కెట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రు. 120 కోట్లకు మార్కెట్ చేశారు. ఆ మేరకు బయ్యర్లు సేఫ్ అయ్యారు. దేవర సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఓజి హక్కులు మాత్రం అంతకన్నా తక్కువ రేటుకే కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
థియేటర్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రు. 108 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హోల్‌సేల్ బయ్యర్లతో బేరాలు నడుస్తున్నాయి. కానీ ఇక్కడ చిన్న సమస్య కూడా ఉంది. విడుదల తేదీ దగ్గరలో ఉంటే కొనేవాళ్ళు ఆసక్తిగా ఉంటారు.. ముందుకు వస్తారు. ఎప్పుడో వచ్చే ఏడాది ఆగస్టు అంటే కనీసం 10 నెలలు ముందుగా పెట్టుబడి పెట్టాలి.. భారీగా అడ్వాన్సులు ఇవ్వాలి.. కింద డిస్ట్రిబ్యూటర్ల నుంచి భారీగా అడ్వాన్సులు తీసుకోవాలి.. పవన్ సినిమా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
నిజానికి ఓజీ షూటింగ్ ప్రారంభించినప్పుడు అదిగో ఇదిగో వచ్చేస్తుంది అన్నారు. ఇక హరిహర వీరమల్లు అయితే గత నాలుగు సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ వస్తోంది. పవన్ ఎన్నికల్లో గెలిచి అధికారం అందుకున్నా షూటింగ్ చేసే పరిస్థితిలో కనిపించడం లేదు. పోనీ కీలక సన్నివేశాలు పవన్‌తో తీసి చిన్న చిన్నవి బాడీ డబుల్ తో కానిచ్చే అవకాశం ఉంటుందన్న గుసగుసలు వినిపించాయి. కానీ ఏది ముందుకు వెళ్లడం లేదు. మరోవైపు పవన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉండడంతో విజయవాడలో సెట్స్ వేసి అక్కడే షూటింగ్ చేస్తారని అంటున్నారు. ఈ కారణాలతో బయ్యర్లు ఓజీ సినిమాను కొనేందుకు భయం భయంగా అడుగులు వేస్తున్న పరిస్థితి.