అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనదైన ప్రతిభ, స్వయంకృషితోనే నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా సైతం సత్తా చాటుతున్న నాగార్జున.. తన మొత్తం ఫిల్మ్ కెరీర్ లో 90కి పైగా సినిమాలు చేశారు. క్లాస్, మాస్ తో పాటు భక్తరస చిత్రాల్లోనూ నటించారు. ఎందరో హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కానీ ఒక్క హీరోయిన్ తో మాత్రం యాక్ట్ చేయడానికి నాగార్జున చాలా భయపడ్డారట. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి. అటు తండ్రి, ఇటు కొడుకు.. ఇద్దరితోనూ రొమాన్స్ చేసిన అతి కొద్ది మంది హీరోయిన్లలో శ్రీదేవి ఒకరు. ఏఎన్ఆర్ కు జోడిగా అనేక చిత్రాల్లో ఆడిపాడిన శ్రీదేవి.. ఆ తర్వాతి కాలంలో నాగార్జునతోనూ జతకట్టింది. నాగార్జున, శ్రీదేవి జంటగా నటించిన తొలి చిత్రం ఆఖరి పోరాటం. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కె. రాఘవేంద్రరావు తరికెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించారు.
1988 మార్చి 12 విడుదలైన ఆఖరి పోరాటం చిత్రం మంచి విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఆఖరి పోరాటం సినిమా షూటింగ్ సమయంలో శ్రీదేవితో కలిసి నటించడానికి మొదట్లో నాగార్జున వణికిపోయేవారట. ఎందుకంటే నటనపరంగా నాగార్జున కంటే శ్రీదేవి చాలా సీనియర్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలతో శ్రీదేవి సినిమాలు చేశారు. ఆల్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అటువంటి శ్రీదేవి పక్కన తాను నటించగలనా అని నాగార్జున భయపడేవారట. కానీ రోజుల గడుస్తున్న కొద్ది నాగార్జునలో భయం పోయింది. శ్రీదేవితో కలిసి యాక్ట్ చేయడం ఆయన ఛాలెంజ్ గా తీసుకున్నారు .ఆమెతో కలిసి పోటా పోటీగా నటించేవారు. ఇక ఆఖరి పోరాటం తర్వాత నాగార్జున-శ్రీదేవి కాంబినేషన్ లో రామ్ గోపాల్ వర్మ గోవిందా గోవిందా సినిమాను తీశారు. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. మరోవైపు బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో శ్రీదేవి-నాగార్జున జంటగా నటించారు. అన్నింటిలోనూ ఆఖరి పోరాటం అభిమానులకు మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది.