నటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, శ్రీదివ్య, దేవ దర్శిని, రాజ్‌కిరణ్; స్వాతి కొండె, జయప్రకాశ్, శ్రీరంజని తదితరులు.
సినిమాటోగ్రఫీ: మహేంద్రన్ జయరాజ్
ఎడిటింగ్: ఆర్.గోవిందరాజ్
సంగీతం: గోవింద్ వసంత
నిర్మాతలు: జ్యోతిక – సూర్య
తెలుగు విడుదల: సురేష్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: సి.ప్రేమ్‌కుమార్
రిలీజ్ డేట్ : 28–9–2024
పరిచయం :
తమిళ హీరో సూర్య తమ్ముడు కార్తీ సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.. మార్కెట్ ఉంది. మరి ముఖ్యంగా కథల ఎంపికలో కార్తీకి మంచి టేస్ట్ ఉంది. తెలుగులో కార్తీ నటించిన ఎన్నో సినిమాలకు ప్రేక్షకులకు బ్రహ్మానందం పట్టారు. ఈ క్రమంలోనే కార్తీ నటించిన తాజా సినిమా సత్యం సుందరం టైటిల్ తో ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 96 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీ ప్రేమ్ కుమార్ నవలగా రాసుకుని కథను సత్యం సుందరం సినిమాను తెరకెక్కించారు. బంధాలు.. భావోద్వేగాల కలయికతో తర్కెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
గుంటూరులో ఉండే సత్యమూరి (అరవింద స్వామి) కి తన చిన్న నాటి నుంచి ఉన్న తరతరాల సొంత ఇల్లు అంటే ఎంతో ఇష్టం ఉన్నా.. అదంతా కోల్పోయి వైజాగ్‌కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. విశాఖకు వచ్చేశాక సత్యం మళ్లీ తన చిన్నాన్న కూతురు అయిన చెల్లి పెళ్లి కోసం ఇష్టం లేకుండానే వెళ్లాల్సి వస్తుంది. అలా పెళ్ళికి వెళ్లిన తర్వాత తాను బాగా తెలిసిన వ్యక్తిగా సుందరం (కార్తీ) పరిచయం అవుతాడు. అక్కడ నుంచి వీరిద్దరి పరిచయం ఎలా మారింది.. ఎలా మలుపులు తిరిగింది ? సత్యంకు ముందు కాస్త చికాకు అనిపించినా సుందరంకు ఎలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాడు ? తనకు ఎవరో తెలియని సుందరంని సత్యం ఎలా ఫేస్ చేస్తాడు ? ఈ బంధాలు.. బావోద్వేగాలకు ఉన్న లింక్ ఏంటనేది ఈ సినిమా చూస్తే కాని తెలియదు.
విశ్లేషణ :
టాలెంటెడ్ హీరో కార్తీ తన కెరీర్ లో చాలా నేచురల్ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి మెప్పించాడు. కార్తి సినిమాలు అంటే పల్లెటూరు నేపథ్యం ఎక్కువగా కనిపిస్తుంది. అలా తన నుంచి వచ్చిన మరో అందమైన పల్లెటూరు సినిమా సత్యం సుందరం. ఇంకా చెప్పాలి అంటే కార్తీ గతంలో నటించిన పల్లెటూరి సినిమాల కంటే ఇది చాలా బాగుంటుంది.. కార్తీ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ అయితే అతడి అభిమానులతో పాటు న్యూట్రల్ అభిమానులను కూడా ఎంతో భావోద్వేగానికి లోను చేస్తుంది. కార్తీ పాత్రలో అమాయకత్వం.. మాటకారితనం తన లుక్ తో సుందరం అనే పాత్రకి కార్తీ ప్రాణం పోశాడు. తన పాత్ర నుంచి ఎంత పరిణితి కనిపిస్తుందో.. అంతకు మించిన భావోద్వేగం కూడా కనిపిస్తుంది.. ఇది కచ్చితంగా ప్రేక్షకులు హృదయాలను హత్తుకుంటుంది.
ఇక కార్తీతో పాటు సినిమా అంతా సాగే మరో ముఖ్యపాత్రలో అరవిందస్వామి అదరగొట్టేసాడు. మరి ముఖ్యంగా తన చెల్లెలికి బంగారు ఆభరణాలు తొడిగే సీను కానీ ఫ్రీ క్లైమాక్స్‌లో తన భార్యతో కార్తీక్ కోసం చెప్పే సీన్లలో అరవిందస్వామి ఇచ్చిన ఎమోషనల్ నటన అద్భుతంగా ఉంది. అలాగే కార్తీతో మంచి ఫన్ సీన్లు ఇచ్చాడు. వీటితోపాటు దర్శకుడు చెప్పాలనుకున్న ఎమోషనల్ ప్లే ఆడియన్స్ లో బాగా వర్క్ అవుతుంది. ఎవరో మనకు తెలియని వ్యక్తి.. కానీ మనం వాళ్లకు బాగా తెలిసిన వారు మనపై చూపించే ప్రేమ.. అభిమానం ఎంతో సహజంగా కల్మషం లేకుండా ఈ సినిమాలో చూపించబడ్డాయి. ఇవి కచ్చితంగా ఆడియన్స్ ని కదిలిస్తాయని చెప్పాలి. తెలుగు నేటివిటికి అనుగుణంగా డబ్బింగ్ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇక మైనస్‌ల విషయానికి వస్తే కొన్ని సీన్లు ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయని చెప్పాలి. సినిమా కొన్ని చోట్ల స్లోగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఒక ఎమోషనల్ సెకండాఫ్ తో అయితే ఫస్టాఫ్ కొంచెం ల్యాగ్ గా అనిపిస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ :
టెక్నికల్‌గా నిర్మాణ విలువలు అదుర్స్.. పల్లెటూరి అందాలను చూపించిన కెమేరా వర్క్ సూపర్. సినిమాకు మ్యూజిక్ వెన్నముక. పాటలు బాగున్నాయి. సినిమా మూడు గంటలు ఉన్నా కొన్ని చోట్ల ల్యాగ్ అయినా బోర్ కొట్టకుండా ట్రిమ్ చేసిన ఎడిటింగ్ బాగుంది. ఇక 96 లాంటి ఎమోషనల్ డ్రామా ఇచ్చిన సీ ప్రేమ్ కుమార్ నుంచి వచ్చిన మరో బెస్ట్ మూవీ ఇది. సినిమా ఆద్యంతం మనస్సుకు హత్తుకుంటుంది. సినిమాలో కనిపించే నటీనటుల్ని చూస్తే మనలోనో మన ఊర్లోనో ఒకర్నో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా సినిమాని మాత్రం మంచి ఎమోషన్స్ తో తాను తీసుకెళ్లారు.
ఫైనల్‌గా…
ఇక ఫైనల్‌గా చెప్పాలంటే సత్యం సుందరి సినిమా చాలా రోజుల తర్వాత మనస్సును హత్తుకునేలా వచ్చిన ఓ ఎమోషనల్ డ్రామా. కార్తీ, అరవింద స్వామిల ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో పాటు దర్శకుడు రాసుకున్న కథనం అందులోని కదిలించే భావోద్వేగాలు సినిమాలో బాగా వర్కౌట్ అవుతాయి. ఫ్యామిలీతో సహా ఈ సినిమాను ఎంచక్కా ఎంజాయ్ చేయాలి.
సత్యం సుందరం రేటింగ్ : 3. 25 / 5