దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. 8 ఏళ్ల వయసులోనే ఓ ఇంగ్లీష్ మూవీ కోసం కెమెరా ముందుకు వచ్చిన నిత్యామీనన్.. మొదట జర్నలిస్టు కావాలని ఆశపడింది. కానీ విధి ఆమెను సినీ రంగం వైపు నడిపించింది. హీరోయిన్లందరూ గ్లామర్ పుంతలు తొక్కుతుంటే నిత్యామీనన్ మాత్రం ప్రాధాన్యత ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా స్టార్ హోదాను సంపాదించుకుంది.
ఎందరో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఉత్తమ నటిగా జాతీయ పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది .అయితే నిత్య పేరులో మీనన్ ఉండడం వల్ల దాదాపు అందరూ ఆమెను మలయాళ అమ్మాయి అని అనుకున్నారు. కానీ అభిమానులకు కూడా తెలియని విషయం ఏమిటంటే.. నిత్యామీనన్ మలయాళీ కానే కాదు. ఆమె కన్నడ అమ్మాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టింది.
ఆమె పూర్తి పేరు.. ఎన్.ఎస్ నిత్య. ఎన్ అంటే నళిని కాగా.. ఎస్ అంటే సుకుమార్. తల్లిదండ్రుల పేర్లలో మొదటి అక్షరాలను కలుపుకొని ఎన్.ఎస్ నిత్యాగా పేరు పెట్టుకుంది. ఎందుకంటే నిత్య ఫ్యామిలీలో ఇంటిపేర్లను వాడరు. కులాన్ని పేర్లతో ముడి పెట్టడం వారికి ఇష్టం ఉండదు. ఇక పాస్ పోర్ట్ కోసం నిత్య తన పేరు చివర్లో మీనన్ ను యాడ్ చేసుకుంది. అది కూడా న్యూమరాలజీ ప్రకారం పెట్టిన పేరు.
ఈ విషయం తెలియక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు టికెట్ కొచ్చి ఉంచి వేయమంటారా మేడం అని అడిగేవారట. అలా అడిగినప్పుడు తనకెంతో నవ్వొస్తుంటుందని నిత్యామీనన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే తాము బెంగళూరు వాసులమని.. మూడు తరాల నుంచి మా కుటుంబం అక్కడే ఉంటుందని, స్కూల్లో తన సెకండ్ లాంగ్వేజ్ కన్నడ అని నిత్యమీనన్ ఈ సందర్భంగా తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. నిత్యా కన్నడ అమ్మాయి అని తెలియడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.