టాలీవుడ్ హిస్టరీ చూసుకుంటే కరోనా తర్వాత ప్రతి యేడాది ఆగస్టులో టాలీవుడ్‌కు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఒక్కోసారి డబుల్ షాకులు కూడా ఉన్నాయి. 2022 ఆగస్టులో విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ సినిమా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. దాని నుంచి ఇంక చాలామంది కోలుకోలేదు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే చాలామంది భారీ రేట్లు పెట్టుకొని నిండా మునిగిపోయారు. కొంతమంది బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఇంకా లైగర్ దెబ్బ నుంచి కోలుకోలేదు. ఆ మరుసటి యేడాది 2023 ఆగస్టులో కూడా బిగ్ షాక్ ఉంది. ఈసారి చిరంజీవి వంతు.
చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో వచ్చిన భోళా శంకర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయింది. ఇంకా చెప్పాలి అంటే చిరంజీవి ఇమేజ్ కి మచ్చ తెచ్చేంత డ్యామేజ్ చేసింది. భోళా శంకర్ ఇది ఏ రేంజ్ ప్లాప్ అంటే.. నిర్మాత తన ఆస్తులు కూడా అమ్ముకున్నాడనే ప్రచారం జరిగింది. అప్పట్లో తర్వాత దానిని ప్రొడ్యూసర్ ఖండించారు. అదే ఏడాది ఆగస్టులో చివర్‌లో వరుణ్ తేజ్ నటించిన గాండీవ ధారి అర్జున సినిమా కూడా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. ఇక ఈ ఏడాది ఆగస్టులో రెండు షాక్‌లు తగిలాయి. ఒకటి రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఎన్నో అంచనాలతో ఈ సినిమాను కొన్నవాళ్ళందరూ నిండా మునిగిపోయారు.
రెండోది మిస్టర్ బచ్చన్. రవితేజ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో మిరపకాయ మ్యాజిక్ రిపీట్ అవుతుందని.. భారీ రేట్లకు మిస్టర్ బచ్చన్ కొన్నవాళ్ళందరూ మునిగిపోయారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమాకు వస్తే కథలో డెప్త్‌లేదు. కథనంలో గ్రిప్ లేదు. మాటల్లో పూరి మార్క్ లేదు. పాటల తప్ప మిగిలినవన్నీ తేలిపోవడంతో డబుల్ ఇస్మార్ట్.. డబుల్ ప్లాప్ అయ్యింది. ఇలా కరోనా తర్వాత ప్రతి ఏటా ఆగస్టులో షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ నెలలో ఆయ్ లాంటి ఒకటి, రెండు చిన్న సినిమాలు హిట్ అయిన ఊహించని ఎదుటి దెబ్బలు మాత్రం కామన్ అయ్యాయి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు టాలీవుడ్ హీరోలు బలైపోతున్నారు. ఇది వచ్చే యేడాది అయినా మారుతుందేమో చూడాలి.