ఆర్ఆర్ఆర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. దేవరతో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌లు సంయుక్తంగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు అందిస్తున్నాడు.
దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు దేవర చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం ఎన్టీఆర్ మూవీకి బిజినెస్ పరంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దేవర తమిళ థియేట్రికల్ రైట్స్ ను నిర్మాతలు విక్రయించారు.
శ్రీ లక్ష్మీ మూవీస్ వారు దేవర సినిమా తమిళనాడు రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దేవర తమిళ్ రైట్స్ రూ. 7.5 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా మంచి రేటనే చెప్పాలి. ఎందుకంటే, తమిళ సినిమాలను కోట్లు కుమ్మరించి తెలుగులోకి తెచ్చుకుంటాము. కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఎక్కువ రేటు పెట్టేందుకు అక్కడి వాళ్లు ఒప్పుకోరు. ఈ లెక్కన ఏడున్నర కోట్లు అంటే సాలిడ్ ధరకు అమ్ముడుపోయినట్లే అని అంటున్నారు.
ఇక కోలీవుడ్ లో దేవర మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 18 కోట్లు. ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 18 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను రాబడితే.. సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాకి తమిళంలో 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. కాబట్టి దేవర మూవీకి పాజిటివ్ టాక్ వస్తే.. టార్గెట్ ను రీచ్ అవ్వడం పెద్ద కష్టమైన పనేమి కాదనే చెప్పొచ్చు.