క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో చందమామ ఒకటి. 2007లో విడుదలైన ఈ చిత్రంలో నవదీప్, శివ బాలాజీ హీరోలుగా నటించగా.. కాజల్ అగర్వాల్, సింధు మీనన్ హీరోయిన్లుగా చేశారు. నాగబాబు, సత్యం రాజేష్, ఆహుతి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. కేఎమ్ రాధా కృష్ణన్ సంగీతం సమకూర్చారు.
సుమారు 17 ఏళ్ల క్రితం అంటే 2007 సెప్టెంబర్ 6న విడుదలైన చందమామ చిత్రం.. ప్రేక్షకుల నుంచి సానుకూల సమీక్షలను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. పలు థియేటర్స్ లో 100 రోజులు ఆడింది. కృష్ణవంశీ డైరెక్షన్, కథ, కథలోని పాత్రలు, సాంగ్స్ సినిమాకు ప్రధానం బలంగా నిలిచాయి. రూ. 4.85 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన చందమామ.. ఫుల్ రన్ లో ఏకంగా రూ. 9.35 కోట్ల షేర్ రాబట్టి సూపర్ సూపర్ హిట్ గా నిలిచింది.
2009లో అ ఆ ఇ ఈ పేరుతో తమిళంలోకి, చెల్లిదారు సంపిగేయ పేరుతో కన్నడలోకి చందమామను రీమేక్ చేశారు. ఈ మూవీ తోనే కాజల్ కెరీర్ ఊపందుకుంది. అగ్ర తారగా ఎదిగింది. ఇకపోతే చందమామలో నవదీప్ మెయిన్ హీరోగా నటించాడు. అయితే మొదట అతని పాత్ర కోసం టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ను కృష్ణవంశీ ఎంపిక చేశారు.
అప్పటికి ఇంకా అడివి శేష్ హీరో అవ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నారు. ఆ టైమ్ లో చందమామ సినిమాలో ఆఫర్ వచ్చింది. రెండు రోజులు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో అడివి శేష్‌ను తప్పించి నవదీప్ ను హీరోగా తీసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు.