మంగిలంపల్లి వెంకటేశ్ అంటే గుర్తుకు రావడం కష్టమే కానీ ఫిష్ వెంకట్ అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. ఆది మూవీతో వెండితెరపై అడుగు పెట్టిన ఫిష్ వెంకట్.. కామెడీ టచ్ ఉండే రౌడీ పాత్రల ద్వారా పాపులర్ అయ్యాడు. తనదైన యాస, నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. 2002 నుంచి గత ఏడాది వరకు ఫిష్ వెంకట్ వందకు పైగా చిత్రాల్లో నటించాడు.
అయితే ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఫిష్ వెంకట్.. ఇప్పుడు ఆరోగ్యం పాడై దయనీయ స్థితిలో నలిగిపోతున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగా గత కొంత కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఫిష్ వెంకట్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది. ఆ టైమ్ లోనే బీపీ, షుగర్ బయటపడటంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. అప్పట్నుంచి చాలా వీక్ అయ్యాను. కాలు మీద చర్మం పోతుంది. కొన్ని రోజులుగా నడవడం కూడా కష్టమైపోతుంది. మరోవైపు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. సుమారు ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను.
అనారోగ్య పరిస్థితుల వల్ల సినిమాల్లో ఛాన్సులు వచ్చినా చేసే ఓపిక లేదు. ఆపరేషన్స్ కు, డయాలసిస్ కు లక్షలు ఖర్చయ్యాయి. ప్రస్తుతం కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. ఆర్థికంగా కొడుకులు పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు కూతురు కొంత డబ్బులు ఇస్తుంటుంది. గతంలో ఎంతో మందికి సాయం చేశాను. కానీ ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంకట్ ను టాలీవుడ్ ప్రముఖులు ఆదుకోవాలని, ఆర్థికంగా భరోసా ఇవ్వాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.