ఒకప్పుడు తెలుగు వెండితెరపై స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన నటుల్లో బేతా సుధాకర్ ఒకరు. 70, 80 దశకాల్లో తమిళ ఇండస్ట్రీలో హీరోగా చక్రం తిప్పిన సుధాకర్.. తెలుగులో మాత్రం కమెడియన్ గా సత్తా చాటారు. అలాగే విలన్ గా, సహాయక నటుడిగా కూడా మెప్పించారు. మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 600 కి పైగా చిత్రాల్లో పని చేశారు. నిర్మాతగా కూడా కొన్ని సినిమాలను రూపొందించారు.
అయితే 2005లో విడుదలై సూపర్ హిట్ మూవీ సంక్రాంతి తర్వాత సుధాకర్ వెండితెరపై కనుమరుగయ్యారు. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో సుధాకర్ సడెన్ గా సినిమాలెందుకు మానేశారు..? సంక్రాంతి మూవీ తర్వాత ఆయనకు ఏం జరిగింది..? అన్న విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. కుమారుడు బెన్నితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధాకర్.. తన ఫిల్మ్ కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతినే నటుడిగా నాకు చివరి సినిమా. దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అందుకునే సినిమాలకు దూరమయ్యాను. ప్రస్తుతం సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాను. ఇక యాక్టింగ్ ను కొనసాగించలేను. కానీ నా లోటుని నా కొడుకు భర్తీ చేయాలని అనుకుంటున్నాను అని సుధాకర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, అనారోగ్యం కారణంగా సుధాకర్ చాలా మారిపోయారు. ఒకప్పుడు ఎంతో పుష్టిగా ఉన్న ఆయన.. ఇప్పుడు గుర్తుపట్టలేనంత బక్కగా చిక్కిపోయారు.