సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం రఘు తాత ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. హిందీ రాని తమిళ అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనే కథాంశం నేపథ్యంలో రూపుదిద్దుకున్న రఘుతాత ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే.. దసరా చిత్రానికిగానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ఈ క్రమంలోనే గతంలో తనకు వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ పెళ్లి ప్రపోజల్ గురించి రివీల్ చేసింది. కీర్తి సురేష్ ను అమితంగా అభిమానించే ఓ వ్యక్తి నేరుగా ఒకరోజు ఆమె ఇంటికి వెళ్లాడట. పెళ్లి చేసుకుంటానని కీర్తి సురేష్ ముందు సదరు అభిమాని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడట.
మొదట అతని మాటలకు కీర్తి సురేష్ చాలా భయపడిపోయిందట. కానీ ఆ తర్వాత అతను చూపించే అభిమానం, ప్రేమ కీర్తికి ఎంతగానో నచ్చాయట. సినీ తారలుగా తాము పడుతున్న కష్టానికి ఇలా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమ వస్తుందని.. దాని కోసం ఎంత కష్టపడినా పర్వాలేదనిపిస్తుందని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో జూ.ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని ఉందంటూ ఆమె తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. మహానటి ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ ను తొలిసారి చూశానని.. ఆయన చాలా మంచి వ్యక్తి, ఎనర్జిటిక్‌గా ఉంటారని కీర్తి పేర్కొంది. ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయాలని ఉందని.. ఆన్ స్క్రీన్ పై మా జంట బాగుంటుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. మరి యంగ్ టైగర్ తో కలిసి సినిమా చేసే అవకాశం కీర్తి సురేష్ కు వస్తుందా.. రాదా.. అన్నది చూడాలి.