90వ దశకంలో తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో సంఘవి ఒకరు. కర్ణాటకలోని మైసూర్‌లో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించిన సంఘవి.. 1993లో కొక్కొరొకో మూవీతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. దశాబ్దన్నర కెరీర్ లో 80కి పైగా చిత్రాల్లో నటించిన సంఘవి.. బుల్లితెరపై గోకులతిల్ సీతై, సావిత్రి వంటి పలు సీరియల్స్ లో కూడా పని చేసింది.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే సంఘవి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. రాజశేఖర్ శివయ్య చిత్రంలో నటిస్తున్న టైమ్ లో ఆ చిత్ర దర్శకుడు సురేష్ వర్మతో సంఘవి ప్రేమలో పడింది. తన తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే సంఘవి 2000వ సంవత్సరంలో సురేష్ వర్మను పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్య జీవితం మొదట్లో బాగానే సాగింది. కానీ కొన్నాళ్లకు ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అవి పెరిగి పెరిగి విడాకులకు దారి తీశాయి.
వ్యక్తిగత జీవితం సంఘవి కెరీర్ ను బలంగా ప్రభావితం చేసింది. 2005 నుండి సినిమాలు చేయడం తగ్గించేసిన ఆమె.. 2008 తర్వాత వెండితెరపై కనుమరుగైంది. చాలా ఏళ్లు ఒంటరి జీవితాన్ని గడిపిన సంఘవి.. 2016లో ఐటీ ప్రొఫెషనల్ వెంకటేష్‌ని రెండో వివాహం చేసుకుంది. బెంగుళూరులోని ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లైన నాలుగేళ్లకు అంటే 2020లో సంఘవి చాన్వి అనే అమ్మాయికి జన్మించింది. ప్రస్తుతం భర్త, కూతురితో సంఘవి హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 2019లో కొలంజి అనే తమిళ సినిమాతో బిగ్ స్క్రీన్ పై సంఘవి రీఎంట్రీ ఇచ్చింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో సంఘవికి అనుకున్నంత జోరుగా ఆఫర్లు రావడం లేదు.