మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తెరకెక్కించిన మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చిరంజీవి చాలా రోజుల తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా మెల్లమెల్లగా మొదలైంది. హోల్‌సేల్గా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కలిపి నిర్మాతలు ఏకంగా రు. 120 కోట్లు చెబుతున్నట్టు తెలుస్తోంది.
అంటే నైజాం – సీడెడ్ – ఆంధ్ర మూడు ప్రాంతాలు కలిసి అమ్మాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా కన్నా ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పాలి. ఈ రేటు మీద ఇప్పుడు డిస్కషన్లు కూడా మొదలయ్యాయి. రు. 120 కోట్ల షేర్ కేవలం ఆంధ్ర.. తెలంగాణలో రావాలి అంటే కనీసం రు.220 కోట్ల గ్రాస్ రావాల్సి ఉంటుంది. టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ ఈ సినిమా ఏపీ – తెలంగాణ హోల్‌సేల్ హక్కులు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినా ఇది చాలా ఎక్కువ రేటు అని రు. 100 కోట్ల వరకు తాను ఇస్తాను అని భేరసారాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
అంటే ఆంధ్ర రు. 60 కోట్లు – నైజాం రు. 45 కోట్లు – సీడెడ్ రు. 15 కోట్లకు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఇంత రేటు రావాలంటే సినిమా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. సంక్రాంతికి వస్తుంది.. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిరంజీవి సినిమా పైగా రేట్లు పెంచుకోవచ్చు అన్న ఆశలు అయితే ఉన్నాయి. రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య – బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో పోటీపడి మరి రు. 110 కోట్ల షేర్ సాధించింది. ఆ లెక్కల ప్రకారం మరో రు. 10 కోట్లు ఎక్కువగా రు. 120 కోట్లు కావాలని నిర్మాతలు పట్టుబడుతున్నారు. ఏది ఏమైనా రు. 120 కోట్లు షేర్ అంటే సినిమాకు ఎంతో సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప రికవరీ కష్టం అని చెప్పాలి.