ఒకప్పుడు తెలుగు వెండితెరపై స్టార్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన నటుల్లో లక్ష్మీపతి ఒకరు. టీవీ వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించిన లక్ష్మీపతి.. ఆ తర్వాత నటుడిగా మారారు. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి హాస్యనటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. బాబీ, అల్లరి, మురారి, నీ స్నేహం, తొట్టిగ్యాంగ్, అదిరిందయ్యా చంద్రం, ఎవడి గోల వాడిది, కితకితలు.. ఇలా 2000 నుంచి 2008 వరకు డబ్బైకి పైగా చిత్రాల్లో లక్ష్మీపతి నటించారు.
అలాగే కృష్ణ వంశీ యొక్క చంద్రలేఖతో సహా పలు సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. అయితే చేతి నిండా ఆఫర్లతో బిజీ కామెడియన్ గా సత్తా చాటుతున్న సమయంలోనే లక్ష్మీపతి గుండెపోటుకు గురై మరణించారు. ఇకపోతే లక్ష్మీపతి కుమారుడు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరో అన్న సంగతి మీకు తెలుసా..? ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు సంతోష్ శోభన్.
అయితే లక్ష్మీపతికి సంతోష్ వరుసకు కొడుకే అయినా సొంతం కొడుకు కాదు. బాబీ, వర్షం, నాని, చంటి వంటి చిత్రాలను తెరకెక్కించిన సీనియర్ డైరెక్టర్ శోభన్ మనందరికీ తెలుసు. అయితే ఈ శోభన్ కు లక్ష్మీపతి స్వయానా అన్న. బాహుశా చాలా మందికి ఈ విషయం తెలియదు. 2008లో ప్రముఖ హీరోయిన్ భూమికకు కథ చెబుతూ శోభన్ ఛాతీ నొప్పితో కుప్పకూలిపోయారు. దాంతో భూమిక భర్త భరత్ ఠాకూర్ వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే శోభన్ మరణించారు.
శోభన్ చనిపోయిన నెల రోజుకే కుంగుబాటుకు గురై లక్ష్మీపతి కూడా మరణించారు. అన్నదమ్ములిద్దరూ గుండె పోటుతో నెల రోజుల గ్యాప్ లో కన్నుమూశారు. ఇక డైరెక్టర్ శోభన్ కు ఇద్దరు కుమారులు. ఒకరు సంతోష్ శోభన్ కాగా.. మరొకరు సంగీత్ శోభన్. ఇప్పటికే సంతోష్ శోభన్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సంగీత్ ఇటీవల మ్యాడ్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్ట్రోంగ్ గా నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు.