దివంగత నందమూరి నట సౌర్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ నట, రాజకీయ వారసుడిగా సినిమాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు బాలకృష్ణ. తండ్రి నటరత్న అయితే బాలయ్య యువరత్న అయ్యారు. తండ్రికి తగ్గ నటసింహంగా.. యువరత్నగా, బాక్సాఫీస్ బొనంజాగా.. గోల్డెన్‌స్టార్‌గా బాలయ్య ఎన్నో బిరుదులు సొంతం చేసుకున్నారు. ఆయన తొలి సినిమా తాతమ్మ కల రిలీజ్ అయ్యి 50 ఏళ్లు అవుతోంది. బాలయ్య సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు అవుతోన్న వేళ సెప్టెంబరు 1న నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా జరగబోతోంది.
టాలీవుడ్ అంతా ఏకమై ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది. ఇప్పటికే బాలయ్యకు బావ అయిన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు అందరికి ఆహ్వానాలు వెళ్లాయి. సీనియర్ హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోలు.. కుర్ర హీరోలు ప్రతి ఒక్కరు ఈ ఈవెంట్‌కు వస్తున్నారు. మరీ ముఖ్యంగా యువ హీరోలు విశ్వక్‌సేన్, సిద్దు జొన్నలగడ్డ, కార్తికేయ ఇలా దాదాపు 10మంది హీరోలు బాలయ్య కోసం స్టెప్పులు వేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక కొన్ని కామెడీ స్కిట్లు కూడా ప్లాన్ చేశారట. అందుకోసం ఈ కుర్ర హీరోలు అందరూ రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. కొన్ని కామెడీ స్కిట్లు కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, వెంకటేష్ తదితర కథానాయకులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. నాగార్జున కూడా ఇదే వేదికపై కనిపిస్తాడంటున్నా వచ్చే వరకు నమ్మకం లేదు.. నాగ్ వస్తే అది సెన్షేషనలే.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారని ప్రచారం జరిగినా… సెప్టెంబరు 2న పవన్ పుట్టిన రోజు కావడంతో రావడం వీలు కావడం లేదని తెలుస్తోంది. తమిళ చిత్రసీమ నుంచి విజయ్‌సేతుపతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మలయాళం హీరోలు కూడా వస్తున్నారట.