బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో హీరోయిన్ గా దూసుకుపోతోంది. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్ సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ స్టార్డమ్ అందుకునేందుకు తెగ కష్టపడుతోంది. ఇదిలా ఉంటే.. జాన్వీ కపూర్ తాజాగా తన అప్ కమింగ్ ఫిల్మ్ ఉలఘ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
అయితే యాంకర్ ఎలాంటి పాత్రలో నటించకూడదని నిర్ణయించుకున్నారు? అని ప్రశ్నించగా.. జాన్వీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ను మలుపు తిప్పే అవకాశమైనా సరే హెయిర్ లేకుండా నటించాల్సి వస్తే మాత్రం కచ్చితంగా నో చెబుతానని జాన్వీ పేర్కొంది. ఎంత క్లిష్టమైన పాత్రైనా పోషిస్తానుగానీ.. చచ్చినా జుట్టు లేకుండా మాత్రం నటించను. ఉలఘ్ లోని పాత్ర కోసం జుట్టును కొంత కట్ చేసుకోవాలని దర్శకుడు చెప్పాడు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.
నా తొలి సినిమా ధడక్ కోసం జుట్టు కత్తిరించుకున్నా. దాంతో మా అమ్మ ఎందుకిలా చేశావ్? అంటూ చాలా కోప్పడింది. నా జుట్టంటే మా అమ్మకు చాలా ఇష్టం. మూడు రోజులకొకసారి ఆయిల్ రాసి మసాజ్ చేసేది. ఏ రోల్ కోసమైనా హెయిర్ ను మాత్రం కట్ చేయించుకోవద్దని అమ్మ స్ట్రిక్ట్ రూల్ పెట్టింది. అది నేను తప్పకుండా ఫాలో అవుతాను అంటూ జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.
కాగా, జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేసింది. అందులో దేవర ఒకటి కాగా.. ఆర్సీ 16 మరొకటి. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే బుచ్చిబాబు తెరకెక్కించబోయే ఆర్సీ16 ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ సరసన జాన్వీ హీరోయిన్ గా అలరించబోతోంది.