ఒక హీరో వదిలేసిన కథను మరొక హీరో పట్టుకోవడం అనేది ఇండస్ట్రీలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గతంలో వివిధ కారణాల వల్ల చాలా కథలను రిజెక్ట్ చేశాడు. అలా రిజెక్ట్ అయిన ఓ కథతో మాస్ మహారాజా రవితేజ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. తన మార్కెట్ ను పది రెట్లు పెంచుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు కిక్.
వక్కంతం వంశీ అందించిన కథతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా గోవా బ్యూటీ ఇలియానా యాక్ట్ చేసింది. షామ్, జయ ప్రకాష్ రెడ్డి, సాయాజీ షిండే, ప్రభ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన కిక్ మూవీ 2009లో విడుదలైన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రవితేజ స్టార్డమ్ ను మరింత పెంచింది. అయితే కిక్ మూవీకి రవితేజ ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని భావించారట. ఆయన్ను కలిసి కథ కూడా వినిపించారట. ఎన్టీఆర్ కు స్టోరీ నచ్చినప్పటికీ.. తనకు సెట్ అవ్వదనే ఫీలింగ్ కలిగిందట.
పైగా అప్పటికే సురేందర్ రెడ్డితో అశోక్ మూవీ చేసి ఎన్టీఆర్ ఒక ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సున్నితంగా సురేందర్ రెడ్డికి నో చెప్పారు. ఆ తర్వాత అదే కథతో రవితేజను ఒప్పించి సురేందర్ రెడ్డి కిక్ మూవీ తీశాడు. బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. దర్శకుడిగా అతనికి ఇదే తొలి విజయం కావడం విశేషం.