పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో మొదలైన ప్రయాణం రామ్ హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాతో పూర్తవుతుందా..? దర్శకుడు పూరి జగన్నాథ్ సినీ ప్రయాణం ఇక ముగిసే దిశకు వెళుతుందా..? అంటే అవును అన్న చర్చలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నో సినిమాలు డిజాస్టర్లు అయినా కూడా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్యాక్ బౌన్స్ అయ్యారు పూరి జగన్నాథ్. అయితే లైగర్ అతిపెద్ద డిజాస్టర్. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ అనుకున్నారు. ఆ సినిమా ఘోరంగా తన్నేసింది. లైగర్ – డబుల్ ఇస్మార్ట్ సినిమాను చూసినవారు.. పూరి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం లేదని చర్చించుకుంటున్న పరిస్థితి.
ఇస్మార్ట్ శంకర్ ముందు అన్ని డిజాస్టర్ సినిమాలు.. దాదాపు పూరి కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు. అయితే రామ్ ఎనర్జీ, డ్యాన్సులు, మంచి కిక్కిచ్చే పాటలు, పక్కా స్టోరీ, అందమైన ఇద్దరు హీరోయిన్లు ఇవన్నీ కలిసి ఇస్మార్ట్ పెద్ద హిట్ అయింది. అయితే లైగర్, డబుల్ ఇస్మార్ట్ మళ్ళీ తన్నేసాయి. డబుల్ సినిమా అసలు పూరీ ఎందుకు తీసాడో అర్థం కాని పరిస్థితి. తాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీసానని చెప్పడంతో సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ నమ్మారు. ఈ సినిమాలో సరైన హీరోయిన్ పాత్ర లేదు. హీరోయిన్ సెట్ కాలేదు. కథ కూడా ఇస్మార్ట్ శంకర్‌ను అటు.. ఇటు.. తిప్పినట్టుగా ఉంది.
ఇక మణిశర్మ చాలా నాసిరకం సంగీతం ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే అసలు పూరి తో సినిమా చేసేందుకు ఇప్పుడు టాలీవుడ్‌లో ఏ హీరో కూడా రెడీగా లేరు. కనీసం మిడిల్ రేంజ్ హీరోలు సైతం పూరి సినిమా అంటేనే భయపడుతున్న పరిస్థితి. అసలు పూరికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. నిర్మాతలు కూడా ఎవరు ముందు రావట్లేదట. పోనీ సొంత బ్యానర్ పై కూడా సినిమా తీద్దామంటే ఫైనాన్షియల్ గా అంత బలంగా ఏమీ లేదు. ఇక డబుల్ ఇస్మార్ట్ కారణంగా దాదాపు రూ.40 కోట్లు పాగొట్టుకున్న ప్రైమ్ షో సంగతి తేలాల్సి ఉంది. పూరి ఎంత వెనక్కి ఇస్తారు అన్నది తెలియలేదు. ఏది ఏమైనా పూరి ఏదైనా అద్భుతం చేసి తర్వాత సినిమాతో హిట్ కొట్టకపోతే ఆయన కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డు పడినట్టే చెప్పుకోవాలి.