టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ హిట్ గా నిలిచిన మురారి చిత్రం మళ్లీ థియేటర్స్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించారు. సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, లక్ష్మి, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన మురారి 2001 ఫిబ్రవరి 17 విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
అయితే ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డే కావడంతో నిన్న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. వాస్తవానికి ఇటీవలి కాలంలో రీ రిలీజ్ సినిమాల ప్రదర్శన దారుణంగా పడిపోయింది. రీ రిలీజ్ ట్రెండ్ ముగుస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో మురారి మూవీ థియేటర్స్ లో మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద మహేష్ కలెక్షన్స్ పరంగా వీర కుమ్ముడు కుమ్మాడు.
తొలిరోజు వరల్డ్ వైడ్‌గా మురారి అంచనాలను అధిగమించి రూ. 5.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు రూ. 4.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు రీరిలీజ్ అయిన తెలుగు సినిమాల్లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా మురారి రికార్డు సెట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మురారి వసూళ్లను గమనిస్తే..నైజాంలో రూ. 2.93 కోట్లు, సీడెడ్ లో రూ. 32 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 30 లక్షలు, తూర్పు గోదావరిలో రూ. 18 లక్షలు, పశ్చిమలో రూ. 16 లక్షలు, గుంటూరులో రూ. 22 లక్షలు, కృష్ణలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలు వచ్చాయి.
అలాగే కర్ణాటకలో రూ. 20 లక్షలు, తమిళనాడులో రూ. 10 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టిన మురారి.. ఓవర్సీలో రూ. 37 లక్షలు, రెస్టాఫ్ వరల్డ్ లో రూ. 20 లక్షలు సొంతం చేసుకుంది. ఓవరాల్ గా రీ రిలీజ్ లో మహేష్ బాబు క్లాసిక్ మూవీ దుమ్ము దులిపేసింది.