భాగ్యశ్రీ బోర్సే.. ఈ ముద్దుగమ్మ గురించి పరిచయాలు అక్కర్లేదు. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ప్రసిద్ధి చెందిన భాగ్యశ్రీ.. ఇటీవలె మిస్టర్ బచ్చన్ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో మాస్ మహారాజ రవితేజ హీరోగా చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు.
భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ నెగటివ్ టాక్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావించిన భాగ్యశ్రీ బోర్సేకి తీవ్ర నిరాశ ఎదురైంది. ఆమె అందానికి, అభినయానికి మంచి మార్కులే పడినా.. ఒక ఫ్లాప్ మూవీతో ఎంట్రీ ఇవ్వడం భాగ్యశ్రీకి పెద్ద మైనస్ అయింది. అయితే నిజానికి భాగ్యశ్రీ చేయాల్సిన ఫస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ కాదట. ఒక సూపర్ హిట్ సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టాల్సి ఉంది. కానీ మిస్ అయింది.. కాదు కాదు భాగ్యశ్రీ మిస్ చేసుకుంది.
గత ఏడాది బాలీవుడ్ లో యారియాన్ 2, చందు ఛాంపియన్ వంటి చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలను పోషించిన భాగ్యశ్రీ బోర్సేకి టాలీవుడ్ లో మొదట ఆయ్ మూవీలో యువ హీరో నార్నె నితిన్ కి జోడిగా నటించే అవకాశం వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా.. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించాడు. ఆడిషన్ లో భాగ్యశ్రీని ఎంపిక చేశాకా.. కొద్ది రోజులు ఆమెకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందట.
అయితే ఆయ్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొద్ది రోజుల ముందు భాగ్యశ్రీకి డైరెక్టర్ హరీష్ శంకర్ నుంచి పిలుపొచ్చింది. ఆయన మిస్టర్ బచ్చన్ లో రవితేజ పక్కగా హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చారు. వెతుక్కుంటూ గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని భావించిన భాగ్యశ్రీ.. ఆయ్ మూవీ నుంచి తప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో నయన్ సారికను తీసుకున్నారు. కట్ చేస్తే.. ఒకే రోజు మిస్టర్ బచ్చన్, ఆయ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వగా.. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆయ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలా దురదృష్టం కొద్ది భాగ్యశ్రీ ఆయ్ వంటి హిట్ మూవీని వదిలేసి డిజాస్టర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మరి రాబోయే రోజుల్లో ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.