ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదలైన తెలుగు చిత్రాల్లో మిస్టర్ బచ్చన్ ఒకటి. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా.. ఆయన పక్కన కొత్త భామ భాగ్యశ్రీ బోర్స్ యాక్ట్ చేసింది. జగపతిబాబు, తనికెళ్ల భరణి, సత్య, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల, భూషణ్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
2018లో విడుదలైన బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు ఇది రీమేక్. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15న విడుదలైన మిస్టర్ బచ్చన్ తొలి ఆట నుంచేనెగటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. రవితేజ అభిమానులను సైతం మిస్టర్ బచ్చన్ మెప్పించలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
దాదాపు రూ. 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్.. ఇప్పటివరకు కనీసం రూ. 10 కోట్ల రేంజ్ లో కూడా షేర్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇదిలా ఉండగా.. మిస్టర్ బచ్చన్ ఓటీటీ రిలీజ్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సాలిడ్ ధరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే థియేటర్స్ లో సరైన రెస్పాన్స్ రాకపోవడం వల్ల లేట్ చేయకుండా మిస్టర్ బచ్చన్ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 12న నెట్ఫ్లిక్స్ లో ఈ చిత్రం రిలీజ్ కానుందని.. ఆ రోజు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సైతం మిస్టర్ బచ్చన్ అందుబాటులోకి వస్తుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇక ఇదే నిజమైతే నెల తిరక్క ముందే రవితేజ లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చినట్లు అవుతుంది.