ప్రస్తుత రోజుల్లో నెగటివ్ టాక్ వస్తే ఎంత పెద్ద సినిమాను అయినా కూడా రెండు మూడు వారాలకే థియేటర్స్ నుంచి లేపేస్తున్నారు. అలాంటిది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రీసెంట్ గా ఓ మూవీ ఫ్లాప్ టాక్ తో 200 రోజులు థియేట్రికల్ రన్ ను సాధించి సరికొత్త రికార్డును సెట్ చేసింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది.
హారిక అంట హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జయరామ్, జగపతిబాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించగా.. థమన్ సంగీతం అందించాడు. సంక్రాంతి పండుగ కానుకగా 2024 జనవరి 12న విడుదలైన గుంటూరు కారం చిత్రం.. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, శ్రీలీల డ్యాన్సులు, సాంగ్స్ తప్పా సినిమాలో గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమీ ఉండవు. రొటీన్ స్టోరీని త్రివిక్రమ్ మరింత రొటీన్ గా తీసి ఆడియన్స్ ను నిరాశ పరిచాడు. కానీ ఫెస్టివల్ అడ్వాంటేజ్ మరియు మహేష్ బాబు క్రేజ్ తో కమర్షియల్ గా గుంటూరు కారం బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ. 172 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. అలాగే ఓటీటీలోనూ, మరోపక్క జెమినీ టీవీలో ఫస్ట్‌టైమ్ టెలికాస్ట్ అయినప్పుడు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
ఇక తాజాగా గుంటూరు కారం సినిమా నయా రికార్డును సెట్ చేసింది. 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన గుంటూరు కారం చిత్రం.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడులో ఉన్న చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్ లో 200 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. రోజుకి 4 ఆటలుగా ప్రదర్శింపబడి చరిత్ర సృష్టించింది. ఏదేమైనా నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా ఇన్ని రోజులు ఆడటం అనేది నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి.