పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజమౌళితో సహా పలువురు స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిశారు. భారీ అంచనాల నడుమ జూన్ 27న విడుదలైన కల్కి చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో 1000 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా నిలిచింది. అయితే ఇటువంటి బిగ్గెస్ట్ మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసిందట కీర్తి సురేష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. కల్కిలో ఏఐ సాయంతో ఆలోచించే సూపర్ కారు బుజ్జికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిందన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఎవరికీ తెలియని ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇక్కడ ఉంది.
మహానటి మూవీ దగ్గర నుంచి కీర్తి సురేష్, నాగ్ అశ్విన్ మధ్య మంచి సన్నిహిత్యం ఉంది. ఆ సన్నిహిత్యంతోనే నాగ్ అశ్విన్ కల్కిలో ఓ పాత్రను ఆమెకు ఆఫర్ చేశారట. అయితే కీర్తి సురేష్ మాత్రం ఆ పాత్రను తాను చేయలేనని సున్నితంగా రిజెక్ట్ చేసింది. కానీ కల్కిలో తనకు భాగం కావాలని ఉందంటూ మెసేజ్ పెట్టిందట. అప్పుడు నాగ్ అశ్విన్ బుజ్జికి వాయిస్ ఓవర్ అందించే ఛాన్స్ ను తనకు ఇచ్చారని కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని.. కల్కి పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని తెలిపింది. అయితే కల్కిలో తాను రిజెక్ట్ చేసిన పాత్ర ఏది అనేది మాత్రం చెప్పనని కీర్తి సురేష్ తేల్చేసింది. కాగా, సినిమా స్టార్టింగ్ లో దివ్య అనే గర్భిణీ పాత్రలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించింది. ఆ పాత్రనే కీర్తి సురేష్ రిజెక్ట్ చేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.